ఆధునిక విజ్ఞానంతో పాటు సంప్రదాయాలను పాటించాలి
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
నియోజకవర్గ స్థాయిలో తణుకులో మహిళలకు ముగ్గుల పోటీలు
భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఉపకరిస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గస్థాయిలో రాబోయే సంక్రాంతి పురస్కరించుకుని తణుకు జడ్పీ హైస్కూల్ ఆవరణలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో పాటు పిల్లలకు సాంప్రదాయాన్ని నేర్పించడం ద్వారా ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోగలమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు


