నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు వెల్లడి
నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్
గత ప్రభుత్వం అన్నదాతను దగా చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శ
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదే విధంగా పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత క్రింద నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సంబంధిత పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ చెక్కును అన్నదాతలకు అందించారు. అనంతరం లబ్ధిదారులైన రైతుల అభిప్రాయం తెలుసుకున్నారు. సరైన సమయంలో సరైన రీతిలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల మొఖాల్లో ఆనందం ఉన్నప్పుడే సంబంధిత కార్యక్రమం విజయవంతమైందనడానికి సాక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు నిరంత ప్రక్రియని చెబుతూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎం కిసాన్ యోజన-అన్నదాత సుఖీభవ క్రింద రైతన్నలకు ఏటా రూ.20,000 ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఇప్పటికే తొలి విడతగా కేంద్రం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కలిపి రూ.7,000 రైతుల ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రెండో విడతగా కేంద్రం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 కలిపి మరో రూ.7,000 రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. మూడో విడతలో కేంద్రం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు రెండు విడతల క్రింద రైతన్నల ఖాతాల్లో రూ.14,000 జమ చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు..త్వరలోనే ఆ సొమ్ము జమ చేసి ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు.
గత ప్రభుత్వం నాడు ఎన్నికలకు ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత ఒకమాట చెప్పి అన్నదాతలను మోసం చేసిందని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే తాము నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి అనంతరం కేంద్ర ప్రభుత్వమిచ్చే నిధులతో కలిపి కేవలం రూ.13000 ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని కులాలు మాత్రమే నిధులు ఇస్తాం అన్ని కులాలకు ఇవ్వమన్న మాటను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేస్తూ రైతులను ఆదుకోవాలన్న తపనతో పాటు వివక్ష ఉండకూడదని, వారిని అభివృద్ధి పథం వైపు నడిపించడమే ప్రభుత్వ ధర్మమన్నారు. అన్నం పెట్టే మహానుభావుడు రైతని, రైతుకు కులం, మతం, పార్టీ అంటూ ఉండదన్నారు.. అలాంటి అన్నదాతకు ఇచ్చే సహకారానికి కులాల ఎంపిక చేయవద్దనే మాటను కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో భూయజమానులకే కాకుండా కౌలు దారులకు సైతం సీసీఆర్సీ కార్డులు ఇచ్చి వారిని ఆదుకుంటున్నామన్నారు. రైతును కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ధాన్యాన్ని సేకరించే క్రమంలో కూటమి ప్రభుత్వం కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందన్నారు. కానీ గత ప్రభుత్వంలో రెండు మూడు నెలల సమయం పట్టేదని తేడాను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున ధాన్యం సేకరిస్తున్నామన్నారు.
నిడదవోలులో ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రతి ఏటా ఎర్రకాలువ వల్ల జరుగుతున్న నష్టాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబునాయడుకు వివరించానన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రూ.250 కోట్ల అంచనా వ్యయంతో శాశ్వత పరిష్కారం తేవాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎర్రకాలువ గేట్లు పాడై పోవడంతో వాటిని బాగు చేసుకునేందుకు కేబినెట్ లో చర్చించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసుకునేందుకు రూ.1.8 కోట్లతో ఎఫ్ డీఆర్ నిధులు తెచ్చానన్నారు. గతేడాది ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన నిడదవోలు రైతాంగానికి రూ.5 కోట్లకు పైగా ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు కృషి చేశానన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెబుతూ ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ తదితర సూపర్ సిక్స్ హామీలను వివరిస్తూ తద్వారా లబ్ధిదారులకు ఒనగూరిన లబ్ధిని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఖజనాను ఖాళీ చేసి వెళ్లినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు.
అన్నం తినేటప్పుడు తొలి ముద్ద సమయంలో రైతన్నను తలుచుకోవాలని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయాన్ని వదలని ఏకైక వ్యక్తి అన్నదాత అని అభివర్ణించారు. ఆరుగాలం శ్రమించి పండించే రైతన్నను ఆదుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరణ విషయంలో, నిధుల జమ విషయంలో, విపత్తులు వచ్చిన సమయంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడంలో తాము రైతాంగానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతన్నలది..రైతన్నలను ఆదుకునే విషయంలో ఎంతటి సహకారమైనా అందించేందుకు సిద్ధమని వెల్లడించారు.
కార్యక్రమంలో విశిష్ట అతిథి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, అగ్రికల్చర్ ఏడీ సి.హెచ్ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏవోలు బి. రాజారావు, ఎం.కిరణ్, జి. సత్యనారాయణ, మండల తహశీల్దార్లు, కూటమి నాయకులు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.


