నిడదవోలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
1211 స్వయం సహాయక సంఘాల్లోని 11,850 మంది మహిళలకు రూ. 149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ
ఆహార శుద్ధి విభాగంలో మహిళల కోసం ‘క్యూలెక్స్ ఇండస్ట్రీస్’తో ఎంఓయూ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మహిళలకు రూ. 38,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు స్థాపించిన డ్వాక్రా సంఘాలే నేడు మహిళల ఆర్థిక సుస్థిరతకు పునాదులని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు:”మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. ఆకాశంలో సగం, జనాభాలో సగం ఉన్న మహిళలే సమాజాన్ని నడిపించే శక్తులు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలులోని డా.బి.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నిడదవోలులోని 1,211 సంఘాల్లోని 11,850 మంది మహిళలకు రూ. 149 కోట్ల 34 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును అందజేశారు.మహిళలు ఆహార పదార్థాల తయారీలో రాణించేందుకు ‘క్యూలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, శిక్షణలో ఈ సంస్థ సహకరిస్తుందని, ఇది మహిళలకు లాభదాయకమైన ఉపాధిని కల్పిస్తుందని వివరించారు.సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనె, జూట్ బ్యాగులు, జీడిపప్పు తదితర స్టాళ్లను మంత్రి దుర్గేష్ పరిశీలించి, తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళామణులను ఘనంగా సత్కరించారు. “ఎమ్మెల్యే అవుదామని వస్తే నన్ను మంత్రిని చేసిన ఘనులు నిడదవోలు ప్రజలు. మీ మంత్రిగా, సోదరుడిగా మహిళా సాధికారతకు నా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాను” అని మంత్రి దుర్గేష్ భావోద్వేగంతో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్యలను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ కీలక అంశాలను వెల్లడించారు.
మహిళా సాధికారతకు నిదర్శనం: దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరకు మహిళలే కీలక పాత్రలు పోషిస్తున్నారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ హోంమంత్రి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితలు మహిళా శక్తికి నిదర్శనాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు స్థాపించిన డ్వాక్రా సంఘాలే నేడు మహిళల ఆర్థిక సుస్థిరతకు పునాదులని కొనియాడారు.
మహిళా పారిశ్రామికవేత్తలు: ప్రతి కుటుంబం నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబునాయుడు ఆశయం. గత ఏడాదిన్నరలో లక్ష మందిని తయారు చేశామని, 2026-27లో 5 లక్షల మందిని తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి మరింత అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మహిళలకు రాజకీయ ప్రాధాన్యత: స్థానిక సంస్థలకే పరిమితమైన 33% రిజర్వేషన్లను పార్లమెంట్ స్థాయి వరకు వర్తింపజేసి, మహిళలను చట్టసభలకు పంపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి ఒక్క మహిళలను నాయకులను చేసేలా కేంద్రం, కూటమి ప్రభుత్వం కలిసి చర్యలు ప్రారంభించాయని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా మహిళలను చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు.
సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత: గత ప్రభుత్వం కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి ద్వారా సాయం అందిస్తే కూటమి ప్రభుత్వం‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏటా రూ. 15,000 అందిస్తుందన్నారు. ‘దీపం 2’ ద్వారా ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘స్త్రీ శక్తి’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్ – అమెరికా యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినప్పటికీ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఘంటాపథంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం పేరుతో మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున మహిళలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలను వివరించారు. గత ప్రభుత్వం అందించిన పెన్షన్లను 3 వేల నుండి 4 వేలకు, దివ్యాంగులకు 3 వేల నుండి 6 వేలకు పెంచి అందిస్తున్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15 వేల పెన్షన్ అందిస్తున్నామని గుర్తుచేశారు.
ఆరోగ్యం – భద్రత: మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందజేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, తద్వారా పేదలకు పూర్తి ఆరోగ్య భద్రత కలుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి దుర్గేష్ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధాని మోదీలు కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి మహిళలను తల్లిగా, సోదరిగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ తమ కాళ్లమీద తాము నిలబడి మంచి వ్యాపారవేత్తగా మారాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలోని ప్రతి మహిళలకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిడదవోలు పురపాలక సంఘం ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులు, నియోజకవర్గ నాయకులు మరియు వేలాది మంది మహిళలు పాల్గొన్నారు


