మత్స్యకారుల వ్యాపార వృద్ధికి ప్రభుత్వం అండ – మంత్రి కందుల దుర్గేష్

ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పథకం క్రింద ఎఫ్ఎఫ్ పీవో గా ఏర్పడిన కోరుమామిడి ది వడ్డీస్ పిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీకి రూ.2,54,000 చెక్కను అందించిన మంత్రి కందుల దుర్గేష్

మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

నిడదవోలు: దేశంలోని మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మత్స్య రైతులు, మత్య్యకారులను సహకార సంఘం నుండి సమృద్ధి వైపు నడిపించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 100 మంది కన్నా ఎక్కువ ఉన్న మత్స్యకార సొసైటీలకు సంఘ కార్యకలాపాల కోసం సంవత్సరానికి రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అలా రెండేళ్లలో రూ. 5 లక్షలు ఉచితంగా సంఘం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎఫ్ఎఫ్ పీవో (పిష్ ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్) గా ఏర్పడిన కోరుమామిడి ది వడ్డీస్ పిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీకి యాజమాన్య ఖర్చుల నిమిత్తం ఈ నిధులు రావడం జరిగిందని, రాష్ట్రంలో ఇదే ప్రథమమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ నిధులు ఆఫీస్ నిర్మాణానికి, ఫర్మీచర్ ఏర్పాటుకు, మేనేజ్ మెంట్ చేసే సిబ్బందికి వేతనం క్రింద వినియోగించుకోవచ్చన్నారు. 100 కన్నా తక్కువ సభ్యులు ఉన్న సంఘాలకు కూడా న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈడీకి మంత్రి దుర్గేష్ సూచించారు. ప్రతి మత్స్యకారుడు నేషనల్ ఫిషరీ డెవలప్ మెంట్ ప్లాట్ ఫామ్ (ఎన్ఎఫ్ డీసీ)లో రిజిస్టర్ అయి ఉండాలని, రిజిస్టర్ చేసుకున్న మత్స్యకారులకు మాత్రమే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ గ్యారెంటీ సదుపాయం అందుతుందన్నారు. క్రమం తప్పకుండా ప్రతి సభ్యుడు తన వాటా నిధి నుండి రూ.2000 సంఘం ఖాతాలో జమ చేసుకుంటే ఈక్విటీ షేర్ క్రింద ప్రభుత్వం మరో రూ.2000 జమ చేస్తుందన్నారు. అలా ఒక్కో సంఘానికి ఆయా సభ్యులు జమ చేసిన మొత్తం రూ.10 లక్షలు అవుతుందని అప్పుడు ప్రభుత్వం కూడా అందించే ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తద్వారా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ద్వారా వ్యాపారాలు పెంచుకునేందుకు అవకాశం ఉందని, క్రమం తప్పకుండా డబ్బు కట్టుకుంటే ప్రభుత్వం తక్కువ వడ్డీకి రూ.50 లక్షలు నుండి రూ. కోటి దాకా రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, మత్స్యకార్మికులు, మత్స్య విక్రేతలు లబ్ధి పొందవచ్చని సూచించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తి పెంచడం, మత్య్యకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో వంద మంది సభ్యులు ఉండేలా సంఘాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి దుర్గేష్ కోరుమామిడి ది వడ్డీస్ పిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు రూ.2.54 లక్షల విలువైన చెక్కును పంపిణీ చేశారు.

Scroll to Top
Share via
Copy link