గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్., గారి ప్రత్యక్ష ఆదేశానుసారం, పశ్చిమగోదావరిజిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి సకల జూద క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించింది.
పండుగ సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేసారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్-డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పోలీసులు తెలిపారు.
ఈ నిషేధాజ్ఞల అమలులో భాగంగా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు, ఆదివారం నాడు జిల్లాలోని వివిధ సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు మరియు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు, గ్రామ పెద్దలకు జూద క్రీడల వల్ల కలిగే ఆర్థిక, సామాజిక అనర్థాలపై, అలాగే చట్టపరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించారు.
అంతేకాకుండా, కోడిపందాల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బరులను గుర్తించి, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. టెంట్లు, ఫ్లెక్సీలు వంటి ఏర్పాట్లను తొలగించి, నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరించి కోడిపందాలు లేదా జూదం నిర్వహించినా, వాటికి సహకరించినా, స్థలాలు కేటాయించినా వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు, బైండ్ ఓవర్ చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది.
జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని, ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమాచారం సమీప పోలీస్ స్టేషన్కి గానీ, డయల్ 112 కి గానీ తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు తెలియజేశారు.


