అధిక వర్షాలకు వరి రైతులు జాగ్రత్తలు పాటించండి

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, వివిధ దశల్లో ఉన్న సార్వా వరికి శాస్త్రీయ పద్ధతులు పాటించి, పంటను కాపాడుకోవాలని, పంటకు తీసుకోవలసిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డా. చల్లా వెంకట నరసింహరావు, డా. మానుకొండ శ్రీనివాస్ వివరించారు. గురువారం ఉండ్రాజవరం మండలంలో కాల్దరి, వెలివెన్ను తదితర గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఏరువాక శాస్త్రవేత్తలు డా. చల్లా వెంకట నరసింహరావు, డా. మానుకొండ శ్రీనివాస్, మండల రెవిన్యూ అధికారి పి. ఎన్. డి. ప్రసాద్, ఎంపీడీవో కె.శ్రీనివాస్, ఏవో బి.రాజారావు, రైతులు విశ్వనాధం, సత్యనారాయణ తదితరులు సంయుక్తంగా సార్వా వరి పంటను గమనించి, వరి పంట అక్కడక్కడా ఒరిగినట్లుగా గుర్తించి, రైతులకు ఈ క్రింది సూచనలు ఇచ్చారు.

పాలు పోసుకునే దశ : ఈ దశలో 2 నుండి 3 రోజులకన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్ధాలు గింజలలో చేరక గింజ బరువు తగ్గి రంగు మారి, తద్వారా దిగుబడి మరియు నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం + మాంకోజెబ్ లేదా 1 మీ.లీ ప్రోపికొనజోల్ మందును పిచికారి చేయాలి.

గింజ గట్టిపడే దశ నుండి కోత దశ చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాలలో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బి.పి.టి 5204 వంటి రకాలు నీటమునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్నరకాలలో కూడా చేను పడిపోయి ఎక్కువ రోజులు నీట మునిగినట్లతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉన్నది. దీని నివారణకు 5% ఉప్పు ద్రావణాన్ని చేసుపై పిచికారీ చేయాలి. గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను యొక్క బరువువల్ల మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే కణుపుల వద్ద విరిగి నేలకి ఒరుగుతాయి. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్ధం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం లేదా తాలు గింజలు ఏర్పడటం జరిగి, తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది. దీనితోపాటు పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం రంగు మారి, మిల్లింగ్ సమయంలో విరిగిపోయి, బియ్యంపై మచ్చ వచ్చే అవకాశం ఉన్నది. పడిపోయిన చేలలో యంత్రాలతో కోత కోయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల కోతఖర్చు కూడా పెరిగిపోతుంది. నష్ట నివారణకు పడిపోయిన చేలలో వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టే చర్యలు చేపట్టాలి.

Scroll to Top
Share via
Copy link