ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన గంట గౌతమ్ కుమార్ కలుపు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే గంట గౌతమ్ కుమార్ 2018లో తేతలి గోగులమ్మపేట ప్రాంతానికి చెందిన దుర్గా కళ్యాణి అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకుని చివటం గ్రామంలో కాపురం ఉంటున్నాడు. అతను సిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో కాంపౌండర్ గా, భార్య జిఎన్ఎమ్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారికి 2021 లో ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె డెలివరీ సమయంలో అప్పు చేసి వైద్యం చేయించాడు, అనంతరం పాప అనారోగ్య నిమిత్తం అప్పులు చేశాడు, ఈ సందర్భంలో భార్యను కూడా ఉద్యోగం మానిపించి ఇంటి వద్ద పాప అనారోగ్య నిమిత్తం ఉంచడం చేత ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఈ కారణాలతో గౌతమ్ కుమార్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికి తంసప్ కూల్ డ్రింక్ లో కలుపు మందును కలుపుకుని చివటం రైల్వే గేటు వద్ద 24వ తేదీ త్రాగాడు అనంతరం ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయాన్ని చెప్పడంతో హుటాహుటిన తణుకు ఆసుపత్రికి తరలించారు. కలుపు మందు సేవించడంతో పరిస్థితి విషమించి రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ నందు అదే రోజు జాయిన్ చేయగా అప్పటినుండి వైద్యం పొందుతూ పదవ తేదీ మృతి చెందారని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి ఎస్ ఐ నవీన్ తెలిపారు.


