దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి
వైసీపీ దుష్ప్రచారాలను ఖండించిన టిడిపి నేతలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారాలను టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై బురదజల్లేందుకు చేస్తున్న కుట్రలు సరికాదన్నారు. ఈ మేరకు శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణపై చేసిన అవినీతి ఆరోపణలపై ఆధారాలు ఉంటే తీసుకురావాలని బహిరంగ చర్చలో ఎవరు అవినీతిపరులో తేల్చుకుందామన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తేతలి సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో అవినీతి ఎలా చేయవచ్చో నేర్పించిన ఘనుడు మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. 2009 నుంచి 2014 వరకు కారుమూరి చేసిన అవినీతిని బహిర్గతంగా మాట్లాడిన సాయిబాబారెడ్డి ఇప్పుడు నీతులు వల్లించడం ఎంతవరకు సబబు అన్నారు. కారుమూరిని బందిపోటు అంటూ వ్యాఖ్యానించి ఇప్పుడు వైసీపీలో ఉండి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు. తణుకు మండలం టిడిపి అధ్యక్షులు పితాని మోహన్‌రావు మాట్లాడుతూ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న నాయకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదిలేదన్నారు. వైసీపీ లీగల్ సెల్ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. టిడిపి నాయకులు కడియాల సూర్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న సవాల్‌కు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత అయిదేళ్ల కాలంలో చేసిన అవినీతిని ఆధారాలతో బయట పెడతామన్నారు.


