అక్రమాలకు చెక్ పెట్టేలా స్మార్ట్ రేషన్ కార్డులు

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో స్వయంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించిన మంత్రి దుర్గేష్

కార్డుల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలును నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన

కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయన్న మంత్రి దుర్గేష్

రాష్ట్రంలో ఎక్కడి వారైనా, ఎక్కడి నుంచైనా రేషన్​ తీసుకునే సదుపాయం కల్పించామన్న మంత్రి దుర్గేష్

టెక్నాలజీని ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న మొట్టమొదటి సీఎం చంద్రబాబునాయుడని పేర్కొన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు: రేషన్, సరకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ, రేషన్ వ్యవస్థను ప్రక్షాళనచేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌ నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లా కాకుండా ఏటీఎం కార్డు, ఆధార్ కార్డుల తరహాలో జేబులో ఇమిడిపోయే విధంగా రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామన్నారు. కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయన్నారు. అంతేగాక రాష్ట్రంలో ఎక్కడి వారైనా, ఎక్కడి నుంచైనా రేషన్​ తీసుకునే సదుపాయం కల్పించామని మంత్రి దుర్గేష్ వివరించారు. రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పోస్ యంత్రాలనూ కూటమి ప్రభుత్వం ఆధునికీకరించిందని మంత్రి దుర్గేష్ వివరించారు.

కార్డుల పంపిణీలో నిడదవోలు నంబర్ 1 స్థానంలో ఉండటం ఆనందంగా ఉంది: మంత్రి కందుల దుర్గేష్

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ న్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లో మొత్తం రేషన్ కార్డులు 81,749 ఉంటే ఇందులో 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్డుల పంపిణీలో తూర్పుగోదావరిలోనే నిడదవోలును నంబర్ 1 స్థానంలో నిలబెట్టినందుకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై ప్రత్యేక శ్రద్ధ వహించలేదన్నారు. ప్రజలకు అందించే బియ్యం, పంచదార, ఇతరత్రా రేషన్ సరకుల పంపిణీ విషయంలో సరైన రీతిలో పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జాతీయ ఆహార భద్రతా చట్టం అనుసరించి పేద ప్రజానీకానికి సక్రమంగా రేషన్ సరకుల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల కోరిక మేరిక ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ రేషన్ డీలర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అంతేగాక గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు రేషన్ పంపిణీ ఇంటివద్దనే జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. 1-15వ తేదీ వరకు రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. తద్వారా ప్రజలు తమకు కుదిరిన సమయంలో రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించామన్నారు.

సూపర్ సిక్స్ సూపర్ హిట్ : మంత్రి కందుల దుర్గేష్

గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లినా కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కో హామీని నెరవేరుస్తుందని వివరించారు. తొలుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2024లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను రూ.4000 కు పెంచి అందించామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కలిపి జులై 2024లో వృద్ధులకు రూ. 7000 పెన్షన్ ఇచ్చామని గుర్తుచేశారు. దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికిచ్చే పెన్షన్ ను రూ.3,000 నుండి రూ.6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ రూ.6,000 ను రూ.15,000కు పెంచి ఒకటో తేదీనే ఇంటివద్ద అందిస్తున్నామన్నారు. కుల, మత, పార్టీ, ప్రాంత, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శక విధానంలో సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒకవేళ పొరపాటున అర్హులెవరికైనా పెన్షన్ తొలగిస్తే మళ్లీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. దీపం-2 పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో ఉచితగ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. తద్వారా గృహిణుల ముఖాల్లో ఆనందం చూశామన్నారు. 5 కేటగిరి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని 2019లో చెప్పిన వైసీపీ కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేసిందన్నారు. ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ వైసీపీ అన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం క్రింద కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని తెలిపారు.

ప్రజాసేవకే టెక్నాలజీ వినియోగిస్తున్న తొలి సీఎం చంద్రబాబునాయుడు : మంత్రి కందుల దుర్గేష్

దేశంలో టెక్నాలజీని ఒడిసి పట్టుకొని ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెచ్చుకున్నారని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రామడు మాట్లాడుతూ మంత్రి దుర్గేష్ సత్వరమే స్పందించి కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రూపొందిన స్మార్ట్ రైస్ కార్డులు లబ్ధిదారు ఫోటోతో రూపొందించామన్నారు. స్మార్ట్ రైస్ కార్డుతో స్కాన్ చేసి బయోమెట్రిక్, ఐరీష్​ గుర్తింపుతో సరకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ఒక్కో కిలోపై దాదాపు రూ. 46 ఖర్చు చేస్తుందన్నారు. లబ్ధిదారు బయట మార్కెట్ లో కేవలం రూ.10కే అమ్ముతూ మోసపోతున్నారని తెలిపారు. అంతేగాక ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన వారవుతారన్నారు. ఈ క్రమంలో బియ్యం తీసుకున్న రేషన్ కార్డుదారులు ఇతరులకు అమ్మవద్దన్నారు. బియ్యం తీసుకున్నా తీసుకోకున్నా స్మార్ట్ కార్డులు రద్దు కావని స్పష్టం చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో కార్డుల పంపిణీ చేపడుతామన్నారు. కార్డు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 దిశగా ముందుకు వెళ్తుందన్నారు.

కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ స్మార్ట్ రైస్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ప్రధానమైనదన్నారు. లబ్ధిదారులు తాము పొందిన సరకుల నాణ్యత, పరిణామంపై అభిప్రాయాలు తెలియజేయవచ్చని సూచించారు. దుకాణాదారుడిపై తమ అభిప్రాయం తెలిపేలా రూపొందించామన్నారు.

నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వి. పార్వతి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ద్వారా నూతన ఒరవడి సృష్టించిందన్నారు. కార్డుదారులకు సార్టెక్స్ ఫోర్ట్ పైడ్ రైస్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. మిగతా సరకులు సబ్సిడీ ద్వారా అందిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా 5 రోజుల ముందే వృద్ధులకు, వికలాంగులకు ఇంటివద్దనే రేషన్ సరకులు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి రేషన్ కార్డు ముందు క్యూఆర్ కోడ్ బోర్డు డిస్ ప్లే చేస్తున్నామన్నారు. ప్రతి రేషన్ కార్డు దారుడు ఆ కోడ్ ను స్కాన్ చేసి సరకుల నాణ్యతపై తమ అభిప్రాయం తెలపవచ్చన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారు, సింగవరం గ్రామానికి చెందిన పి. అరుణ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డును సులభంగా వెంట తీసుకొని వెళ్లే విధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు కూడా స్పష్టంగా పొందుపరిచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా తల్లికి వందనం, రైతు భరోసా డబ్బులు ఖాతాకు జమ అయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వల్ల తాము లబ్ధి పొందామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రామడు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వి. పార్వతి, నియోజవర్గ అబ్జర్వర్, సివిల్ సప్లై డిస్టిక్ ఆఫీసర్, నిడదవోలు జెడ్పీటీసీ, నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్, ఎమ్మార్వో, కూటమి పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ, మండలాల కూటమి నాయకులు, స్మార్ట్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link