నిడదవోలు పట్టణంలో “పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
ఒక్కొక్కరి రూ.6000 చొప్పున 3వ విడతగా 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.10.75 కోట్ల ఆర్థికసాయం జమ చేశామని వెల్లడి
ఒక్కొక్కరి రూ.20,000 చొప్పున ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.37.83 కోట్ల సాయం అందించామన్న మంత్రి దుర్గేష్
కోరుమామిడిలో గోశాలను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్
కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి – కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని అభివర్ణించిన మంత్రి దుర్గేష్
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో ప్రజలకు సేవకుడిగా నిరంతరం శ్రమిస్తానని పునరుద్ఘాటించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: నేలమ్మ నుదుట స్వేద బిందువును తిలకంగా దిద్ది లోకానికి ఆకలి తీర్చే త్యాగమూర్తి రైతన్న అని మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న తాలుకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని “అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్” పథకం ద్వారా కేంద్ర వాటా (22వ విడత) రూ.2000, రాష్ట్ర వాటా రూ.4000 లు కలిపి మొత్తంగా 2025-26 సంవత్సరానికి గానూ 19,368 మంది రైతులకు ఒక్కొక్కరి రూ.6000 చొప్పున రూ.10.75 కోట్ల మూడో విడత ఆర్థికసాయాన్ని నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా గౌహతి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే కార్యక్రమాన్ని, అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడే కార్యక్రమాన్ని టీవీ ద్వారా రైతాంగానికి చూపిస్తూ సంబంధిత చెక్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు మండలంలో 7748 రైతులకు రూ.4.38 కోట్లు, పెరవలి మండలంలో 7039 రైతులకు రూ.3.75 కోట్లు, ఉండ్రాజవరం మండలంలో 4581 మంది రైతుల ఖాతాల్లో రూ.2.62 కోట్లు నేడు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6000 కలిపి మొత్తం మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ.20,000 సాయం అందించామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 19368 మంది రైతులకు రూ.37.83 కోట్ల సాయం అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ అధికారిక గణాంకాలను వివరించారు. మొత్తంగా 40149 ఎకరాల వ్యవసాయ భూమి, 16874 ఉద్యాన పంటలకు కలిపి మొత్తంగా 57,023 ఎకరాలకు లబ్ధి చేకూర్చామన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.
కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి – గత ప్రభుత్వ వైఫల్యాలు:
గత ప్రభుత్వం ఏడాదికి ఒకే దఫాలో రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి 3 దఫాల్లో కలిపి రూ.7500 మాత్రమే చెల్లించిందని, కేంద్ర సాయం రూ.6000 తో కలిపి మొత్తంగా 13,500 మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. నాడు అందరు రైతులకు వర్తించకుండా నిబంధనలు పట్టారని ఆగ్రహించారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చెప్పినట్లుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతన్నలకు కేంద్ర సాయంతో కలిపి మొత్తం 20,000 అందిస్తున్నామన్నారు. కేంద్రం విడుదల చేసినప్పుడే రాష్ట్రం ప్రభుత్వం ఆర్థికసాయాన్ని కలిపి 3 విడతల్లో అందిస్తుందన్నారు. ఈ క్రమంలో తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2000 రాష్ట్ర ప్రభుత్వం రూ.5000, రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం రూ.5000, ఇప్పుడు మూడో విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 అందిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రం రూ.6000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 చొప్పున రైతన్నల ఖాతాల్లో రూ.20000 జమ చేయడం కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వంగా వర్ణించారు. గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెడితే అధికారంలోకి వచ్చిన దాదాపు రూ. 1600 కోట్లకుపైగా చెల్లించామని గుర్తుచేశారు. అన్నదాత నుండి ధాన్యం సేకరించిన 24 నుండి 48 గంటల్లో కూటమి ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందన్నారు. ఇప్పటికే రెండు మూడు సీజన్ లలో ఆ విషయం నిరూపితం అయిందన్నారు. తమది సాహసోపేత నిర్ణయం అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులున్నా కూడా త్వరితగతిన పరిష్కరించామన్నారు. కానీ గత ప్రభుత్వం నెలలకొద్దీ విడుదల చేయకుండా రైతన్నలను ఇబ్బందులకు గురి చేసిందని పేర్కొన్నారు. రైతుకు సబ్సిడీకే ఎరువులు అందిస్తున్నామన్నారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించి సాగుకు సాయం అందించామన్నారు. డ్రోన్ టెక్నాలజీతో రైతన్నలకు ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టామన్నారు. పొలంబడి ద్వారా వినూత్న దిగుబడి పద్ధతులపై అన్నదాతలకు మార్గనిర్దేశం చేశామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రముఖ శాస్త్రవేత్త విజయ్ కుమార్ ద్వారా సీఎం చంద్రబాబునాయుడు రైతాంగానికి శిక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం జాగ్రత్తగా చేస్తే ఆరోగ్యకర పంటలు పండటంతో పాటు ఎక్కువ దిగుబడి వస్తుందని సాక్షాత్తు ఆ విధానంలో సాగు చేసిన రైతులే పేర్కొన్నారని మంత్రి దుర్గేష్ ఉదహరించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. కేంద్ర సహకారంతో రైతన్నలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంకణబద్దులై ఉన్నారన్నారు.2027 జూన్ నాటికి పోలవరం పూర్తి అవుతుందని ఘంటాపథంగా స్పష్టం చేశారు. రూ.310 కోట్ల విలువైన ఇన్ పుట్ సబ్సిడీని పెంచి అందించామన్నారు. తద్వారా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు భరోసాగా ఉంటుందన్నారు. వ్యవసాయాభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్ లో ఈ ఏడాదికి రూ.53,752.12 కోట్లు కేటాయించిన తొలి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ సందర్భంగా ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమించి పచ్చని పంటలతో దేశానికి సిరిసంపదలు పంచే శ్రమజీవికి వందనం తెలుపుతూ అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉంటేనే.. దేశం సుభిక్షంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుందని పేర్కొన్నారు.
నిడదవోలు ప్రజలకు తాను సేవకుడినే:మంత్రి దుర్గేష్
గత ప్రభుత్వ పాపాలు తమకు శాపాలుగా మారాయని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వివిధ రూపాల్లో నిధులు సేకరించి నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిడదవోలు మున్సిపాలిటీకి రుడా, ఇతర మార్గాల ద్వారా రూ.100 కోట్లు నిధులు సేకరించి అభివృద్ధి పథాన నిలిపామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ మార్చామన్నారు. కోటి రూపాయల అదనపు నిధులు కేటాయించారన్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా అందులో సీఎం చంద్రబాబునాయుడు తనను అంతర్భాగం చేస్తున్నారని కూటమి ధర్మానికి ఇదే నిదర్శనమన్నారు. ఇటీవల ముంబయి పర్యటనలో ప్రఖ్యాత సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో శభాష్ దుర్గేష్ అంటూ తనను కలెక్టర్ కాన్ఫరెన్స్ వేదికగా సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారని గుర్తుచేశారు.తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పరిపాలన దక్షుడైన సీఎం చంద్రబాబునాయుడు, పేదల కంట కన్నీరు రాకుండా చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను నిడదవోలు ప్రజలకు సేవకుడిని అని మరోసారి మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. నియోజకవర్గానికి సేవ చేయడానికే తాను కృషి చేస్తున్నానన్నారు.
అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడిలో గోశాలను సందర్శించి, గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటికి మేత వేశారు. గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భారతీయ సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అనంతరం గ్రామంలోని ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. సాగు పద్ధతులను పరిశీలించి, రసాయన రహిత వ్యవసాయంపై రైతులతో ముచ్చటించారు.ఆవు పేడ, మూత్రం వినియోగంతో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను తయారు చేసుకోవడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని మంత్రి దుర్గేష్ రైతులకు వివరించారు.కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడిని సాధించే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.
కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, ఏఎంసీ ఛైర్మన్ జిన్నాబాబు, జెడ్పీటీసీ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


