మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ
రేలంగిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకంలో మూడో విడత రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకంలో రూ. 14 వేలు జమ కాగా ప్రస్తుతం మూడో విడత రూ. 6 వేలు జమ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో సైతం లక్షల మంది రైతులకు రూ. 58.79 కోట్లు మేర లబ్థి చూకూరుతోందన్నారు. తణుకు నియోజకవర్గంలో సైతం దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 9.61 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్మార్గమైన పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించారని గుర్తు చేశారు. తిరిగి రాష్ట్రాన్ని పునర్మించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


