పీ4 విధానంపై సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నిడదవోలు నియోజకవర్గంలో 192 మార్గదర్శులు ముందుకు వచ్చారని, ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే 2137 బంగారు కుటుంబాలు గుర్తించామన్న మంత్రి దుర్గేష్
సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం, పీహెచ్ సీని ఆకస్మిక తనీఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరికలు జారీ*
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచన..అధికారుల పనితీరు బాగుందని ప్రశంసలు
నిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసి నిడదవోలు నియోజకవర్గంలో పీ4 విధానాన్ని మరింత వేగవంతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.బుధవారం నిడదవోలు సమీపంలోని సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయంలో పీ4 విధానంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా, సమర్థవంతంగా చేరవేయాలన్న సత్సంకల్పంతో పాలన వ్యవస్థను ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులను ఎంత మేర అనుసంధానించారన్న అంశంపై సమీక్షించామన్నారు. ఈ క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో 192 మార్గదర్శులు ముందుకు వచ్చారని, ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే 2137 బంగారు కుటుంబాలు గుర్తించామని మంత్రి దుర్గేష్ వివరించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో మరింత మంది మార్గదర్శులను, బంగారు కుటుంబాలను గుర్తించి, అనుసంధానించి ఆగస్టు 8వ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ఒక సమావేశం నిర్వహించి వారి అవసరాలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణ తయారు చేస్తామన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఎవరైనా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చని పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ప్రణాళికలో భాగంగా సమూలంగా, శాశ్వతంగా పేదరికం నిర్మూలించాలన్న బలమైన లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్ నర్ షిప్ (పీ4) విధానానికి సంకల్పించారని తెలిపారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అనే విధానంతో సమాజంలో పేదరికాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నిరుపేద కుటుంబాలను అభివృద్ధి వైపు నడిపించి పేదరికం లేకుండా చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పీ4 విధానంపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించి తమకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములై సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎంత మంది బంగారు కుటుంబాలను గుర్తించామో తెలుసుకొని వాటి సంఖ్య మరింత పెంచాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నిర్దేశించిన ప్రామాణికాల ప్రకారం మరిన్ని బంగారు కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులంతా బాగా కష్టపడి సీఎం లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదేశించారు.
సమిశ్రగూడెం పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి దుర్గేష్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరికలు జారీ
అనంతరం రాత్రిపూట ఆస్పత్రి మూసివేస్తున్నారన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని సమిశ్రగూడెం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీలో ఎంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్నారు, అత్యవసర వైద్య సేవలు రోగులకు ఏ మేర అందుతున్నాయన్న అంశంపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు.


