ప్రజల సహకారంతోనే ‘క్లీన్ తణుకు’

ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు కృషి చేయాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు

రూ. 5 కోట్లతో తడి పొడి వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన

సైకిల్ పై కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ సహకారం అందించడం ద్వారా త్వరలో క్లీన్ తణుకు చేయడానికి అవకాశం ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. తణుకు పురపాలక సంఘం పరిధిలోని రూ. 5 కోట్లు వ్యయంతో నిర్మించతలపెట్టిన తడి పొడి వ్యర్ధాల నిర్వహణ ప్లాంటు నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. తణుకు పురపాలక సంఘం పరిధిలో రోజుకు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని గత కొన్నేళ్లుగా ఈ చెత్త తణుకు డంపింగ్ యార్డులో పేరుకుపోతోందని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏ రోజుకు వచ్చిన చెత్తను ఆరోజు తడి పొడి చెత్తగా వేరుచేసి ప్రాసెస్ చేయడం ద్వారా డంపింగ్ యార్డ్ లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో మొదటి దశలో 25 ప్లాంట్లు నిర్మాణంలో భాగంగా తణుకు పట్టణంలో ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే నాలుగు నెలల కాలంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అనేక సంవత్సరాలుగా ఉత్పత్తి అవుతున్న చెత్త దాదాపు 70 వేల టన్నుల చెత్తను తీసి ప్రాసెస్ చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా ఈ ప్లాంట్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో తడి పొడి చెత్తను ఏరోజుకారోజు ప్రాసెస్ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. తణుకు పట్టణంలోని ప్రధాన డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మున్సిపల్ సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలు తమ సహకారం అందించి ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పర్యటనకు విచ్చేసిన సమయంలో రూ. 50 కోట్లు నిడుదులు విడుదలకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ. 15 కోట్లు విలువైన పనులు చేపట్టామని రాధాకృష్ణ తెలిపారు. ఇంధనం పొదుపు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు అందుకుని ప్రతి శుక్రవారం నో వెహికల్ డే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం తణుకు పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సైకిల్ పై హాజరయ్యి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు సైతం సైకిళ్లపై కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link