ప్రజల అభిమానం చూరగొన్న ఎన్టీఆర్

బడుగు బలహీన వర్గాలకు అధికారం కల్పించిన మహానేత

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

తణుకులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు పౌరాణిక, సాంఘిక, జానపద పాత్రల్లో నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం తణుకులోని పలుప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో వెలుగొందిన ఎన్టీ రామారావు సమాజంపై బాధ్యతతో ప్రజల అవసరాలకు ఎల్లప్పుడూ స్పందించేవారని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. దళితులు, బీసీలు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన అనేక మంది నాయకులను ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులుగా ఎదగడానికి అవకాశం కల్పించిన గొప్ప దూరదృష్టి నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.అనంతరం తణుకు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్ల పరిధిలోని కళ్యాణ మండపాలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్వయంగా సందర్శించారు. ప్రతి క్లస్టర్‌కు వెళ్లి నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. సీనియర్ కార్యకర్తలను ప్రత్యేకంగా సత్కరించి పార్టీకి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా అన్ని క్లస్టర్లను సందర్శించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు అండగా నిలిచే నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link