అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్
రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థన
నిడదవోలు, మే 28 : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరమహోత్సవాలలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాలకు విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ కి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి, ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ… మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలైన గ్రామ జాతరలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దయాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నాను. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం అన్నిరంగాల్లో ముందంజలో ఉంటూ, ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను అన్నారు. జాతర ప్రాంగణానికి తరలివచ్చిన భక్తులు, ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ప్రజలందరికీ నమస్కరిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. స్థానిక ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులకు, ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



