భూదౌర్జన్యకారులపై కఠిన చర్యలకు ఆదేశం, బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా
పేదల భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: మంత్రి కందుల దుర్గేష్
వైసీపీ నేత భూదౌర్జన్యంపై మంత్రి దుర్గేష్ సీరియస్.. స్టేషన్‌కు పిలిపించి ఆరా తీయాలని ఆదేశం
చట్టం ముందు ఎవరూ అతీతులు కారు.. బాధితురాలికి తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని సూచన
పేదల భూములను కాపాడటమే కూటమి ప్రభుత్వ బాధ్యత: మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: సమాజంలో అండలేని మహిళలపై, పేదలపై జరిగే అన్యాయాలను సహించేది లేదని, ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూటమి ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు. నిడదవోలు పట్టణం సుబ్బరాజుపేటకు చెందిన మాండ్రుమాక శీలావతి అనే నిస్సహాయ మహిళకు జరిగిన అన్యాయంపై మంత్రి దుర్గేష్ తక్షణమే స్పందించి, ఆమెకు కొండంత అండగా నిలిచారు. గురువారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ని కలిసిన శీలావతి అనే మహిళ కన్నీరుమున్నీరవుతూ తన ఆవేదనను పంచుకున్నారు. సుబ్బరాజుపేట గ్రామంలో తమకు వారసత్వంగా వచ్చిన, తమ బతుకుదెరువుకు ఆధారమైన 5 సెంట్ల స్థలాన్ని వైసీపీకి చెందిన ఊర్ల హరికృష్ణ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని మంత్రి దుర్గేష్ ఎదుట వాపోయారు. తాను అత్తగారింటికి (దెందులూరు) వెళ్లిన సమయాన్ని అదునుగా చూసుకుని, అధికారం, బలగంతో ఆ స్థలం తనదేనంటూ సదరు వ్యక్తి దౌర్జన్యానికి దిగాడని, న్యాయం చేయమని ప్రశ్నిస్తే కనీసం మహిళ అని కూడా చూడకుండా భౌతిక దాడులకు తెగబడ్డారని ఆమె కన్నీళ్లతో మంత్రి దుర్గేష్ కి ఫిర్యాదు చేశారు. గతంలో అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో, ఆఖరి ప్రయత్నంగా మంత్రి దుర్గేష్ ని నమ్ముకుని వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళ కన్నీళ్లు, ఆమె పడుతున్న మానసిక క్షోభను చూసి మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా చలించిపోయారు. ఆడబిడ్డలను వేధించినా, వారి ఆస్తులను అక్రమంగా లాక్కున్నా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎమ్మార్వో లతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదరు మహిళకు పూర్తి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళ కుటుంబంపై దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన మంత్రి దుర్గేష్… ఆ కుటుంబానికి తక్షణమే పూర్తి పోలీసు ప్రొటెక్షన్ (రక్షణ) కల్పించాలని అధికారులను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, పేదల భూములను కాపాడటమే ఈ ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. తమ ఫిర్యాదుపై మంత్రి దుర్గేష్ చూపిన చొరవ, తక్షణ స్పందన చూసి బాధితురాలు శీలావతి, ఆమెతో పాటు వచ్చిన బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు. తమకు కానరాని న్యాయం మంత్రి కందుల దుర్గేష్ రూపంలో దొరికిందని హర్షం వ్యక్తం చేస్తూ, మంత్రి దుర్గేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.



