మాజీ సీఎం జగన్ కు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు కౌంటర్

యోగాంద్ర కార్యక్రమం పై మాజీ సీఎం జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శ

గత ప్రభుత్వం రుషికొండ పై ప్యాలెస్ నిర్మించడం వల్ల ప్రతినెల రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతోందని, ఇది మంచి చేసినట్టు ఎలా అవుతుందని మంత్రి దుర్గేష్ సూటి ప్రశ్న

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రుషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో యోగాంధ్రపై వందల కోట్లు ఖర్చు చేశారంటూ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే ప్రజా ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైఖరి బట్టబయలవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణ కు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే రూ. 94 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరి జీవనశైలిలో అది ఒక భాగం కావాలని పిలుపునిచ్చామన్నారు. అంతే తప్ప సంబంధిత నిధులను దుర్వినియోగం చేశామని ఆరోపించడం సరికాదన్నారు.

రుషి కొండపై రూ.500 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన రాజప్రాసాదాలను నిర్మించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆరోగ్యం కోసం యోగాంధ్ర ను నిర్వహించడం తప్పు ఎలా అనిపించిందో అర్థం కావడం లేదన్నారు. గంజాయి, డ్రగ్స్ ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆరోగ్యంపై కనీసం బాధ్యత లేదని ఫైర్ అయ్యారు. శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగన్ కు ప్రజా ఆరోగ్యం గురించి ఏం తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందించాలని పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ముందుకు వచ్చిందని దానిపై రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పిపిపి విధానం గురించి తెలియకపోతే తెలుసుకోవాలని హితవు పలికారు. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేయాలని జగన్ ఇవాళ దొరికిన ప్రతీ దారిని ఎంచుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో పర్యాటక శాఖకు ఏటా రూ. 7.5 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే హరిత రిసార్ట్స్ స్థానంలో ఋషికొండ ప్యాలెస్ ను నిర్మించడం వల్ల రెవిన్యూ కోల్పోందన్నారు. ప్రస్తుతం ప్రతి నెల విద్యుత్ చార్జీలు, నిర్వహణ రూపంలో పర్యాటకశాఖ పై రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతుందని, ఇది మాజీ సీఎం జగన్ నిర్వాకం కాదా అని నిలదీశారు.

ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారత దేశమని, అలాంటి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అందులోనూ ఉత్తరాంధ్ర వేదిక కావడం ఎంతో అదృష్టంగా భావించామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3 లక్షల మందిని భాగస్వామ్యం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని గుర్తు చేసారు. ప్రజల ఆరోగ్యం పట్టని జగన్ రెడ్డి ఇవాళ యోగాంధ్ర కార్యక్రమంపై విషం కక్కుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న గొప్ప కార్యక్రమంపై జగన్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నేరస్థులు, ఖైదీలు, రౌడీలకు అండగా నిలిచే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సహించలేక పోతున్నారన్నారు. నాడు గంజాయి వనాలుగా ఉన్న వాటిని నేడు కాఫీ వనాలుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెడుతున్నామన్నారు. ఇన్ని మాటలు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. పిపిపి విధానాన్ని వ్యతిరేకించే జగన్ నాడు 108, 104 సేవలు ఏ ప్రాతిపదికన నిర్వహించారనే విషయం స్పష్టం చేయాలని తెలిపారు. కనీసం జగన్ హయాంలో ప్రజోపయోగ కార్యక్రమాలు ఏం చేశారో వివరించాలని డిమాండ్ చేసారు.. పిపిపి విధానం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెరుగుతాయన్నారు. అదనంగా 220 సీట్లు పెరగడంతో పాటు 110 సీట్లు కన్వీనర్ కోటాలోనూ పెరుగుతాయన్నారు.. రెండేళ్లలో కాలేజీల నిర్మాణం పూర్తయి దాదాపు 2500 వైద్య సీట్లు పెరుగుతాయని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. జగన్ చేసిన విధానంలో ముందుకు వెళ్తే మరొక 15 ఏళ్లకు కానీ వైద్య కళాశాలలు పూర్తికావని మంత్రి దుర్గేష్ అన్నారు. పిపిపి విధానం వల్ల నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ విధానం ద్వారా యాజమాన్యం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. 33 ఏళ్ళ తర్వాత భూమితో పాటు నిర్మించిన ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇన్ని మాట్లాడుతున్న జగన్ గడిచిన ఐదేళ్లలో కేవలం ఐదు కాలేజీలని ప్రారంభించడం ఆయన నిస్సహాయతకు అద్ధం పడుతోంది అన్నారు. అవి కూడా కేంద్ర నిధులతోనే ప్రారంభించారన్నారు.

జగన్ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కాంట్రాక్టర్ల కు చెల్లించినది రూ.1550 కోట్లు.. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అవసరమయ్యే నిధులు మొత్తం రూ.8,480కోట్లు. పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.700 కోట్లు దారిమళ్లింపు చేసారన్నారు. ఈ 700 కోట్లు పీజీ మెడికల్ సీట్ల కొరకు ఖర్చు చేయలేదు. దీనివల్ల స్పెషలిస్టు డాక్టర్లకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. మెడికల్ సీటు పొందిన విద్యార్థి కూటమి ప్రభుత్వంలో రూ.15వేలు ఫీజు చెల్లిస్తే సరిపోయేదన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీటుకు రూ.12లక్షలు, ఎన్ ఆర్ ఐ సీటుకు రూ.20లక్షలు ఫీజు నిర్ణయించారు అంటే కన్వీనర్ కోటాలో వున్న సీట్లల్లో 50శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రైవేటీకరించింది జగన్ కాదా తెలపాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు.

Scroll to Top
Share via
Copy link