ఉండ్రాజవరం మండలంలోని 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సార్వా సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమాన్ని రైతు సేవ కేంద్రాలలో నిర్వహించినట్లు తహసిల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. చిలకపాడులో జరిగినటు వంటి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలకు ప్రకారం ధాన్యాన్ని 17% తేమ ఉండేలా ఆరపెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే రైతుకు నచ్చినటువంటి రైస్ మిల్లుకు విక్రయించాలని తద్వారా ప్రభుత్వం ప్రకటించినటు వంటి వరి ఏ గ్రేడ్ 2389, కామన్ గ్రేడ్ 2369 రూపాయలకు లభిస్తుందని తెలిపారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటను తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఎకరాకు సుమారు 8 వేల రూపాయలు నష్టపోతున్నారని అలా జరగకుండా ఉండడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. రైతులు సొంతంగా గోనె సంచులు సమకూర్చుకున్నట్లయితే ఒక సంచి కి రూ. 4.74 హమాలీ ఛార్జీల క్రింద క్వింటాలుకు రూ. 22.00 లు, రవాణా ఛార్జీలు కూడా దూరాన్ని బట్టి నిర్ణయించబడతాయని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1967 అని ఏమయినా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు అని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తరువాత ఉదయం 8.00 గం ల నుండి సాయంత్రం 7.00 గం ల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్యంగా తేమ విషయంలో రైతు సేవ కేంద్రం దగ్గర మరియు రైస్ మిల్లు దగ్గర ఉన్నటువంటి తేమ చూసే పరికరాల మధ్య వ్యత్యాసం లేకుండా చూడాలని, కాటా విషయంలో ఇక్కడ తూచి నటువంటి ధాన్యం బరువు అలాగే రైస్ మిల్లు దగ్గర ఉండేటటువంటి వే బ్రిడ్జి బరువులలో వ్యత్యాసం 100 నుండి 200 కేజీల వరకు ఉంటుందని దానివల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అలాగే గతంలో తార్పాలిన్ రాయితీపై ఇచ్చేవారని ప్రభుత్వం ద్వారా ఇప్పుడు కూడా రాయితీపై అందుబాటులో ఉండేలా చూస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవాడ సొసైటీ అధ్యక్షులు అనపర్తి సత్యనారాయణ, రైతులు గోడే ఆదినారాయణ, చట్రాధి నాగేశ్వరరావు, చట్రాధి చిట్టిబాబు, నిడదవోలు పుల్లారావు, వి.ఆర్. ఓ.లక్ష్మీ, పంచాయతీ సెక్రటరీ శివ, వి.ఏ.ఏ.స్వప్న మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.


