ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండో మహాసభలు తణుకు అమరవీరుల స్మారక భవనంలో ఆదివారం నాడు జరిగాయి. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మహాసభకు అధ్యక్షత వహించారు.
ఈ మహాసభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సి.హెచ్.సుందరయ్య మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలు కోసం కొత్త బస్సులు ఏర్పాటు నిధులు కేటాయింపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అవసరమైన సిబ్బంది నియామకాలు లేకుండానే ఆగస్టు 15 నుండి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారనీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను తొలి నుండి సమగ్రమైన అధ్యయనంతో ఎన్డబ్ల్యుఎఫ్ స్వాగతిస్తున్నదని,ఈ స్కీమ్ ద్వారా మహిళల ఉపాధి స్వయం నిర్ణయాలు చైతన్యం సాధికారతకు, సాక్షరతకు అంతిమంగా రాష్ట్రఅభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.పథకము ప్రారంభమైన నెల రోజుల్లోనే కండక్టర్, డ్రైవర్లపై వేధింపులు, కేసులు, 60 మందికి పైగా సస్పెన్షన్లు పెరిగాయని, ఈ పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మారకూడదన్నారు. కొత్త బస్సులు వెయ్యాలనీ, తక్షణం రిక్రూట్మెంట్ చేయాలను డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,వీరికి కార్మిక చట్టాలు వర్తింపచేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలుచేయాలని, ఔట్సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని, అద్దె బస్సు డ్రైవర్లకు ఒప్పందం ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలనీ ఆన్ కాల్ డ్రైవర్లకు గుర్తింపు కార్డులు, కాంప్లిమెంటరీ బస్సు పాసులు ఇవ్వాలనీ సుందరయ్య డిమాండ్ చేశారు. విద్యుత్తు బస్సుల సాకుతో ఆర్టీసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని, తొలి దశలో ప్రధాన నగరాలలోని 12 డిపోలను, రెండవ దశలో 19 డిపోలను ప్రవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు అప్పచెప్పేలా సన్నాహాలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి నేరుగా ఆర్టీసీలే విద్యుత్తు బస్సులు నిర్వహించే అవకాశం వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. అలాగే 12వ పి.ఆర్.సీ నియమించాలని, నాలుగు విడతల డిఏ లను ప్రకటించాలని డి.ఎ బకాయిలు ఇవ్వాలని, పేరుకు పోయిన లీవ్ ఎన్కేష్మాంటు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి ఏ ఎస్ రాయుడు ప్రవేశపెట్టిన రిపోర్టు మహాసభ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అదనపు బస్సులు వేయాలని రిక్రూట్మెంట్లు చేపట్టాలని లీవెన్కేస్మెంట్ పిఆర్సి బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు ఇవ్వాలని స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని మహాసభ తీర్మానించింది.
ఈ మహాసభను ఉద్దేశించి రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్ దొర మరియు తలుకు డిపో కార్యదర్శి ఎన్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం డిపో సహాయ కార్యదర్శి ఆర్ ఆంజనేయులు భీమవరం డిపో నుండి నరసింహారావు నర్సాపురం డిపో కార్యదర్శి కట్ట సత్యనారాయణ సమస్యలపై చర్చించారు.
ఈ మహాసభలో సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి, కే సాయికుమార్ ఎం శ్రీనివాసు దుర్గారావు తదితరులు మాట్లాడినారు.


