పెండింగ్ లో ఉన్న కార్మికుల క్లెయిమ్స్ పరిష్కరించాలి
అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
లక్షలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సంక్షేమ బోర్డులో నిధులను సైతం పక్కన పట్టించిందని విమర్శించారు. సభ్యులు దాచుకున్న సొమ్ములను సైతం గత ప్రభుత్వం దోచుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కమిటీని నియమించిందని గుర్తు చేశారు. సుమారు 50వేల మంది క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల సమయంలో సైతం భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేశారని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈసందర్భంగా కోరారు.


