పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది. నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే అని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్

17 కాలేజీలు తెచ్చాను అని చెప్పుకున్న జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిచేయకపోవడం సిగ్గుచేటని పేర్కొన్న మంత్రి దుర్గేష్

జగన్ తన హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో చెప్పాలని వైసీపీకి సవాల్ విసిరిన మంత్రి దుర్గేష్

అమరావతి: కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు అని కొట్టిపారేశారు.మెడికల్ కాలేజీను ప్రభుత్వాలు నిర్వహించడం కన్నా ఆయా రంగాల్లో నిపుణులైన వారు నిర్వహిస్తే ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని ఈ నేపథ్యంలో పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుందని, నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని తద్వారా వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వంపై భారం తగ్గుతుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అంతేగాక పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కానీ వైసీపీ ఈ వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా సగంలో పెట్టి ఏదో జగన్ రెడ్డి సంపాదించి పెట్టిపోయిన ఆస్తిని అమ్మేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆగ్రహించారు.ఆర్థిక సమస్యలతో మూలనపడ్డ కాలేజ్ లను మళ్లీ పిపిపి విధానంలో పట్టాలు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సుదీర్ఘ కసరత్తు చేసి కేబినెట్ లో సమగ్రంగా చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పు దోవ పట్టించడం సరైన విధానం కాదని హెచ్చరించారు.

జగన్ మోహన్ రెడ్డి పిపిపి విధానాన్ని తప్పు పట్టడం విచిత్రంగా ఉంది: మంత్రి దుర్గేష్

సెల్ఫ్ ఫైనాన్స్ విధానం అని మెడికల్ సీట్ల ఫీజును రూ.12 లక్షలు చేసి అమ్మకానికి పెట్టే విధానాన్ని తెచ్చిన జగన్ రెడ్డి నేడు పిపిపి విధానాన్ని తప్పు పట్టడం విచిత్రంగా ఉందని మంత్రి దుర్గేష్ ఎద్దేవా చేశారు. తాము 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని జగన్ చేస్తున్నది విష ప్రచారం అని ఆగ్రహించారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం, జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిచేయలేదు: మంత్రి దుర్గేష్

వైసీపీ ప్రభుత్వంలో మార్కాపురం కాలేజీని 17 శాతం, మదనపల్లె కాలేజీని 12 శాతం, పులివెందుల కాలేజీని 77 శాతం, ఆదోని కాలేజీ కేవలం 15 శాతం మాత్రమే పూర్తి చేశారని మంత్రి దుర్గేష్ వివరించారు. 17 కాలేజీలు తెచ్చాను అని చెప్పుకున్న జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిచేయలేదని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అన్ని కాలేజ్ లకు కలిపి రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా వైసీపీ హయాంలో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు.వైసీపీ హయాంలో 5 కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకొంటున్న కాలేజీల్లోనూ క్లాసులు కూడా ప్రారంభం కాలేదని, కనీసం సిబ్బందిని కూడా నియమించలేదని చెప్పారు. హాస్టళ్లు అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ విధానం లేదని పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో అరకొర వసతులతోనే కళాశాలలు ప్రారంభమయ్యాయన్నారు. ఇవే ఇలా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఏంటని మంత్రి దుర్గేష్ వైసీపీని ప్రశ్నించారు. అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన వైసీపీ మాత్రం విమర్శలకే పరిమితమైందన్నారు.

కూటమి ప్రభుత్వంలో వేగవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణం: మంత్రి దుర్గేష్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో పాడేరులో మెడికల్ కళాశాల ప్రారంభించిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ కళాశాలల నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన 10 కళాశాలలను వేగవంతంగా పూర్తిచేసి, వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రెండు దశల్లో పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.రెండవ దశలో అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురంలో నిర్మించేందుకు నిర్ణయించిందన్నారు.ఆసుపత్రిని నిర్మించి, నిర్వహించి, ఆ తర్వాత నిర్ణీత కాలానికి ప్రభుత్వానికి తిరిగి అప్పగించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు.

ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి నిర్ణయం..తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీకి విద్యార్థుల భవిష్యత్ పట్టదా?: మంత్రి దుర్గేష్

నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కాలేజీలను అప్‌గ్రేడ్ చేసి, ఏడాదిలో కనీసం ఒక్కో కాలేజ్ లో 100 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఓ వైపు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ లు పూర్తి చేసి సీట్లు అందుబాటులోకి తెస్తుంటే ప్రైవేట్ పరం అంటూ గగ్గోలు చేస్తున్న వైసీపీకి విద్యార్థుల భవిష్యత్ పట్టదా? అని మంత్రి దుర్గేష్ నిలదీశారు. వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం అవుతుందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని మంత్రి అన్నారు.

మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అంటూ వైసీపీ కొత్త పల్లవి..జగన్ హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను తామెలా ప్రైవేట్ పరం చేస్తాం?: మంత్రి దుర్గేష్ మొన్నటి వరకు రాజధాని మునిగిందని, విజయవాడను మళ్లీ వరదలు ముంచెత్తాయని విష ప్రచారం చేసిన వైసీపీ తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి దుర్గేష్ కోప్పడ్డారు. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కోల్పోయి రాష్ట్రంలో నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే వైసీపీ నిమగ్నమైందని విమర్శించారు. జగన్ తన హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో వైసీపీ, జగన్ చెప్పాలని మంత్రి దుర్గేష్ సవాల్ విసిరారు.

తక్కువ ఖర్చుతో వైద్యం ప్రజలకు అందేలా నిర్ణయం: మంత్రి దుర్గేష్

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మాణ సంస్థలు 420 పడకల ఆసుపత్రులను నిర్వహించి, వాటిని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసేలా ఒప్పందం కుదిరిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పీపీపీ విధానంలో నిర్మించిన ఆసుపత్రుల్లో అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో వైద్యం ఉండేలా నిబంధనలు ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇందులో ఓపీ పూర్తిగా ఉచితమని రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు ఇన్-పేషెంట్ సేవల్లో 70 శాతం పడకలకు పీఎంజేఏవై, ఎన్టీఆర్ వీఎస్టీ, సీజీహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఉచితంగా సేవలు అందిస్తుందన్నారు. ఓపీడీ రోగులకు ఉచితంగా జనరిక్ మందులను అందజేస్తున్నామన్నారు.

ఏదో ఉద్దరించామని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్న వైసీపీ: మంత్రి దుర్గేష్

అన్నీ తెలిసినా కూడా వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఏదో చేశాడని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారని మంత్రి దుర్గేష్ ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేసింది వైసీపీ అని అన్నారు. కట్టని మెడికల్ కాలేజీలకు వైసీపీ నేతలు ఎందుకంత హడావిడి చేస్తున్నారో వారికే తెలియాలని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link