మాజీ మంత్రి కారుమూరికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సవాల్
కరోనా అడ్డుపెట్టుకుని తణుకులో కారుమూరి దోపిడీ
రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
రైతు పోరుబాట పేరుతో వైసీపీ దగాకోరు బాట
ఘాటు వ్యాఖ్యలు చేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఏడాది కాలంలోనే రూ. 1200 కోట్లు అవినీతి జరిగిపోయిందని చెబుతున్న మాజీ మంత్రి కారుమూరి ఇందులో కనీసం రూ. 12 అవినీతి జరిగిందని దమ్ముంటే నిరూపించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో కారుమూరి చేసిన అవినీతిని తణుకు నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. గాలి కబుర్లు పోగుచేసి బుడదజల్లాలని ప్రయత్నిస్తే ఖబర్దార్ కారుమూరి అంటూ మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కారుమూరి చేసిన అవినీతి అంతా రికార్డెడ్ గా ఉందన్నారు. కరోనా పేరు చెప్పి నియోజకవర్గంలో ఎంత దోచుకున్నావో అందరికీ తెలుసని అన్నారు. గోల్డ్ షాపులు, ఫ్యాక్టరీలు, ఆయిల్ డీలర్లు, రైస్ మిల్లర్లు ఇలా అందరి దగ్గర దోచుకున్న సంగతి ఇప్పటికి మర్చిపోలేదని అన్నారు. ఇప్పటికీ రైసు మిల్లర్లను వదలలేని పరిస్థితి ఉందని విమర్శించారు. మున్సిపాలిటీ, ప్రభుత్వాసుపత్రి, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ సిబ్బందిని ఐదేళ్లపాటు సొంత అవసరాలకు ఇంట్లో వాడుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంత అవినీతి చేసి ఇప్పుడు ఏదో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నట్లు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పేకాట, బెట్టింగులు చేసే వాళ్లంతా నీ చుట్టూ తిరుగుతున్నారనే విషయం అందరికీ తెలుసని కారుమూరిని ఉద్దేశించి అన్నారు. వారానికోసారి వచ్చి నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. కారుమూరి నియోజకవర్గంలో చేసిన దుర్మార్గమైన పాపాలు ఇంకా ఉన్నాయని అన్నారు. దోపిడీ చేయడానికి పనికిరాని భూములన్నీ ఇళ్ల స్థలాల కోసం కొనిపించారని విమర్శించారు. కారుమూరి నటన చాతుర్యానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎక్కడెక్కడ గనులను దోచేశారో అన్ని రికార్డెడ్ గా ఉన్నాయని అన్నారు. నేనెంత అవినీతి చేశానో… నువ్వెంత అవినీతి చేసావో వస్తే కూర్చుని తేల్చుకుందామని సవాల్ విసిరారు. కరోనా సమయంలో వసూలు చేసిన సొమ్ములో 20 శాతం ఖర్చుపెట్టి, 80 శాతం దోచుకుని దాచుకున్నారని వ్యాఖ్యానించారు.
రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం…
రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఐదేళ్లపాటు మొద్దు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి, స్థానికంగా మంత్రిగా పనిచేసిన కారుమూరి రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. నవరత్నాలు పేరు చెప్పి నవ మోసాలు చేసిన వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచేసారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 ఇస్తామన్న హామీను నిలబెట్టుకున్నామని అన్నారు. యూరియా కొరత అంటూ ముసలి కన్నీరు కారుస్తున్న కారుమూరికి తణుకు నియోజకవర్గంలో ఎక్కడ కొరత ఏర్పడిందో చెప్పాలని కోరారు. ఇటీవల రబీకు సంబంధించి 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఒక నెల ఆలస్యంగా అయినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయంలో ఆరు నెలలకు కూడా రైతులకు డబ్బులు జమ కాలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి బకాయిలు ఉంచిన రూ.1600 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. వైసీపీలో ఉన్న రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కారుమూరికి అర్హత లేదని అన్నారు. రైతు పోరుబాట పేరుతో వైసిపి దగా కోరు బాట నిర్వహిస్తోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


