విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన “కూటమి”
ఉపాధ్యాయ పోస్టులు, భర్తీల విషయంలో పారదర్శకం
గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు చిత్రహింసలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను చిత్రహింసలకు గురి చేశారని ప్రధానంగా మద్యం షాపుల వద్ద నిలబెట్టిన దుస్థితి ఉండేదని అన్నారు. మరుగుదొడ్లు ఫోటోలు తీయించి ఆన్ లైన్ లో పొందుపరిచే విధంగా వారికి బాధ్యతలు అప్పగించడం వారిని అవమానించడమేనని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో తమ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు జమ అయ్యేవిధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో పెన్షనర్లు సైతం తన పెన్షన్ తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యధికంగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన ఘనత ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. 16,375 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనిని చెప్పారు. విద్యకు కల్పిస్తున్న ప్రాధాన్యత ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అస్తవ్యస్తమైన జీవో 117 రద్దుచేసి విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు సైతం పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా చేసిన ఘనత ప్రభుత్వానికి చెందుతుందని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో, ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేశారని అన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న 32 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


