అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వైసీపీ
ఏడాది కూటమి పాలనలో సుపరిపాలన
ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేసే దిశగా కూటమి
ఏడాది పాలన సంబరాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నాశనం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దోపిడీయే ధ్యేయంగా పని చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన జగన్మోహన్రెడ్డి కేవలం దోపిడీ కోసమే అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారని విమర్శించారు. కూటమి పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం తణుకులో నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. స్థానిక కూటమి కార్యాలయంలో కూటమి శ్రేణుల మధ్య కేకు కట్ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మద్యం, ఇసుక, మట్టి ఇలా అనేక దోపిడీలు చేసి తాడేపల్లి ఖజానా నింపుకొన్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచిన జగన్మోహన్రెడ్డి రూ. 11 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని అన్నారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ çహామీలు మొదటి ఏడాదిలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ. 4 వేలు పెంచి ఏడాది రూ. 34 వేల కోట్లు అందిస్తున్నామన్నారు. మొదటి తారీఖునే 95 శాతం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్నా క్యాంటీన్లను మూసివేశారని ఆరోపించారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లుతోపాటు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు రూ. 15 వేలు చొప్పున ఎలాంటి కోతలు లేకుండా అందిస్తున్న నేత చంద్రబాబునాయుడు అన్నారు. రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అయిదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల ఉపాధ్యా పోస్టులను భర్తి చేసే విధంగా డీఎస్సీ నిర్వహిస్తోందన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో భాగంగా రూ. 9 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణాన్ని ఆనాడు చంద్రబాబునాయుడు 70 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ హయాంలో కేవలం 6 శాతం మాత్రమే చేసి చేతులు దులుపుకొన్నారని అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు ప్రణిళికలు చేస్తున్నామన్నారు. పీ4 విధానంలో అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉన్నత కుటుంబాలు పేదలను దత్తత తీసుకుని వారికి చేయూత ఇచ్చేవిధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వంలో పక్కదోవ పట్టించారన్నారు. తిరిగి సబ్‌ప్లాన్ నిధులను వినియోగంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, కిట్లుపై జగన్మోహన్రెడ్డి బొమ్మలు వేసుకుని ఆనందం పొందే వారన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, కిట్లుపై ఎలాంటి పార్టీ గుర్తులు, ఫొటోలు లేకుండా అందజేస్తున్నామన్నారు. అంతకుముందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


