ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ
ప్రజల ఆలోచనల నుండి అభివృద్ధి ప్రణాళికలు తయారు
ప్రజలకు ఉపయోగపడే పథకాల ద్వారా శాశ్వత పరిష్కారం
ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచన
నిడదవోలు సర్వతోముఖాభివృద్ది కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ వెల్లడి
త్వరలోనే తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు…ఇది ప్రజా ప్రభుత్వమని, మంచి ప్రభుత్వమని తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలు/ఉండ్రాజవరం: నిడదవోలు పట్టణంలోని 30 పడకల ఆస్పత్రిని రాబోయే రోజుల్లో 100 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఇప్పటికే ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నామని, అతి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో ఆధునికీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్) మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. అంతకుముందు పెరవలి మండలం కానూరులో, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామాల్లో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాల్లో అదనంగా రూ. 9.83 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 6 పడకల యూనిట్ లను అదే విధంగా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ (ఈసీఆర్ పీ) లను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. బాలలచే కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాలను విస్తృతపరచడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, గుంతలు లేని రహదారులు ఉండాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నేడు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాము ప్రారంభించిన భవనాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య సదుపాయం అందేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అదనపు భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా రోగుల నిర్ధారణకు, రోగుల రుగ్మతలకు అందించే చికిత్సలకు ఉపయోగపడే పాథాలజీ ల్యాబ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ లు ప్రత్యేక దృష్టిసారించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతి చోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు పాథాలజీ సేవలు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయి హెల్త్ కమిషన్ పీహెచ్ సీల్లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్ సీల్లో మరిన్నిసేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సేవా భావం ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలను ఆదరించి, ఆప్యాయంగా పలకరించి తద్వారా వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేసే దిశగా పనిచేసేయాలని సూచించారు.
ముందుచూపుతో పీహెచ్ సీల్లో ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ (ఈసీఆర్ పీ) ఏర్పాటు
గతంలో కరోనా విపత్కర పరిస్థితులు దగ్గరగా చూశామని, తద్వారా ఎంత ఇబ్బందులు పడ్డామో మంత్రి దుర్గేష్ గుర్తుచేస్తూ వివరించారు. గతంలో కోవిడ్ బారిన పడిన వారిని వేరే ప్రాంతానికి తరలించి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించేవాళ్లని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ సదుపాయాన్ని ఆయా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న పీహెచ్ సీల్లోనే ఐసోలేషన్ సెంటర్లుగా ఉపయోగపడేలా ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ (ఈసీఆర్ పీ) ను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం కోవిడ్ కు భయపడాల్సిన అవసరం లేదని ముందుజాగ్రత్తగా విపత్కర పరిస్థితి వస్తే గ్రామాల్లోనే సేవలు అందుబాటులో ఉంటాయని భరోసానిచ్చారు. ఈ విషయంలో కృషి చేసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, నారాలోకేష్ లకు మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.


