అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమీక్ష
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు
ప్రస్తుత వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, ఆయా గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. మంగళవారం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన అధికారులు, సంబంధిత కార్యదర్శులతో తణుకు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర నిర్వహణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పంచాయతీ సిబ్బంది ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీలు, పంట కాలువల్లో చెత్త పేరుకుపోకుంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి కొరతను అధిగమించడానికి ప్రణాళికలు చేపట్టాలన్నారు. తణుకు నియోజకవర్గ పరిశీలకులు యర్రా వేణుగోపాల్రాయుడు, ఆయా గ్రామలకు చెందిన కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


