రాబోయే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు పట్టణంలోని వీకే కన్వన్షన్ సమావేశ మందిరంలో బూత్ ఇన్‌ఛార్జిలు, కూటమి ముఖ్యనాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. బూత్ ఇన్‌ఛార్జిలకు కేటాయించిన 50 ఓటర్లను ఒకటికి రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు. సాంకేతికను వినియోగించుకుని ఓటర్లను గుర్తించి ప్రతి ఓటు పోలయ్యేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పనులను ఉపాధ్యాయులతో చేయించిన విషయం గుర్తు చేశారు. ఒక్క ఓటు కూడా నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలను దాటి మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు. విజయం ఏకపక్షంగా ఉండాలని సూచించారు. నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు అడిగే హక్కు కూటమి నాయకులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు…


