మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తితో విజ్జేశ్వరంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన..గోదావరి బండ్ పరిశీలన

2027 గోదావరి పుష్కరాల కోసం మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ప్రతిపాదన.. విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి!

రూ. 66 కోట్లతో 33 కి.మీల విజ్జేశ్వరం- సిద్ధాంతం బీటీ రోడ్డు నిర్మిస్తే గోదావరి పుష్కరాల సమయంలోనే కాక ఇతర సమయాల్లో కూడా స్థానిక ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి దుర్గేష్ అభ్యర్థన

పెండ్యాల, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో ఏటిగట్టు పటిష్ట పరిచేందుకు నివేదికలు పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు..సాధ్యాసాధ్యాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడి

నిడదవోలు: రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరంలో పర్యటించారు. రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలు – 2027 ముందస్తు ఏర్పాట్లు మరియు మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఒక కీలక ప్రతిపాదనను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జలవనరుల శాఖకు సంబంధించిన విజ్జేశ్వరం నుండి సిద్ధాంతం మధ్య ఉన్న ‘వశిష్ట రైట్ ఫ్లడ్ బ్యాంక్ కెనాల్’ మీదుగా బీటీ రోడ్డు (ఏటిగట్టు) నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం, స్థానిక గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. స్థానికంగా ఉన్న గోదావరి బండ్‌ను పర్యాటకంగా, రవాణా పరంగా డెవలప్ చేస్తే ఉభయ గోదావరి జిల్లాల అనుసంధానానికి సైతం ఎంతో మేలు జరుగుతుందన్న మంత్రి దుర్గేష్ వివరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పుష్కరాల నాటికి ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులను, ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా పెండ్యాల, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో ఏటిగట్టు పటిష్ట పరిచేందుకు నివేదికలు పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రూ. 66 కోట్లతో రవాణా ముఖచిత్రం మార్చే ప్రణాళిక

స్థానికంగా ఉన్న గోదావరి బండ్‌ను డెవలప్ చేస్తే రోడ్డు మార్గం ఎంతగానో బాగుపడుతుందని మంత్రి దుర్గేష్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.సంబంధిత పూర్తి స్థాయి నివేదికలు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపినట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ “గోదావరి పుష్కరాల సమయంలో వచ్చే కోట్లాది మంది భక్తుల రద్దీని నియంత్రించడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ ఏటిగట్టు రహదారి ఎంతో కీలకం. సుమారు రూ. 66 కోట్ల అంచనా వ్యయంతో, 33 కిలోమీటర్ల మేర ఉన్న విజ్జేశ్వరం- సిద్ధాంతం రోడ్డును అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి నిడదవోలు రూరల్, పెరవలి మండలాలు రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతాయి” అని వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా, రవాణా పరంగా సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఈ పర్యటనలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link