ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్

పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి హై ప్రయార్టీ ఇస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జ్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రముఖ స్థానంలో ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్‌కు భూమి పూజ గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్నారు. మొత్తంగా రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ.. సుమారు రూ.4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్–వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో రూ.1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి.

త్వరలో రాయలసీమలో మరో భారీ ప్లాంట్
రెన్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్–వేఫర్ తయారీ యూనిట్‌, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏపీని రెన్యువబుల్ ఎనర్జీకి కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్‌కు హాజరైన రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశలవారీగా రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించనుండగా… త్వరలోనే సుమారుగా రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రక్రియ చేపట్టనుంది. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 2015లో కళ్యాణదుర్గంలో విండ్ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలోకి రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అడుగుపెట్టింది. 717 మెగావాట్ల విండ్, 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సామర్థ్యంతో ఏపీలోని రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్లు ఇప్పటికే పని చేస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో అభివృద్ధి జోరు…. పెట్టుబడుల హోరు…..
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్‌కు వంటి ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీసీఎస్ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించింది. ఈనెలలో అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్ సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు. సాఫ్ట్ వేర్, ఎనర్జీ, స్టీల్, మెడ్ టెక్, ఫార్మా వంటి రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది. మరోవైపు పర్యాటకంగా ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోంది.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు…
ఉదయం 09.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి నుంచి జెడ్.చింతువకు బయలుదేరి వెళతారు. 11.10 గంటలకు రెన్యూ గ్లోబల్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపనలో కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమాన్ని ముగించుకుని మధ్యాహ్నం 02.35 గంటలకు అమరావతి చేరుకుంటారు.

Scroll to Top
Share via
Copy link