వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి

మార్టేరు కిసాన్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని చెప్పారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మార్టేరు గ్రామంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గోదావరి డెల్టాలో ప్రతి గ్రామానికి సాగునీరు అందుతుంది అంటే దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్ అని అన్నారు. సుమారు 70 వరి వంగడాలను అభివృద్ధి చేసిన ఆచార్య రంగా పరిశోధనా స్థానం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కృషి వెనుక శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, రైతు సంక్షేమానికి వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చెప్పారు. తిరిగి వాటిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని వెల్లడించారు. నీటి సంఘాలను బలోపేతం చేసి వాటి ద్వారా కాలువలు బాగు చేయడం, తూడు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి గ్రామాల్లో యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా డ్రోన్లు సబ్సిడీ ద్వారా అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉందని పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏఎంసీల పరిధిలో పుంత రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. శతాబ్ద కాలంగా రైతులకు మెరుగైన వరి విత్తనాలు, అధిక దిగుబడి పద్ధతులు, కొత్త సాంకేతికలను అందిస్తూ వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్న వ్యవసాయ పరిశోధన సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈ సంస్థ రైతులకు మరింత ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలు వ్యవసాయ స్టాల్స్ పరిశీలించి శాస్త్రవేత్తలతో మాట్లాడి కొత్త సాంకేతికతలపై అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాస్త్రవేత్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Scroll to Top
Share via
Copy link