తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రతి ఒక్కరిలో సేవా గుణాన్ని పెంపొందించే విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చిట్టూరి సుజాత సంయుక్త ఆధ్వర్యంలో తణుకులో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న దాతలు చిట్టూరి సుజాతను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరు గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


