ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి 

చారిత్రాత్మకంగా అమరావతి శాశ్వత రాజధాని నిలిచిపోతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఏప్రిల్‌ 6, 2026 చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని అన్నారు. అమరావతి శాశ్వత రాజధాని గెజిట్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడం హర్షణీయమన్నారు. 2014 పునర్విభజన చట్టం సవరించి పార్లమెంటు ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిగా గెజిట్‌ విడుదల చేయడం అభినందనీయన్నారు. ప్రజలు, అమరావతి రైతులకు న్యాయం చేసే విధంగా వారి త్యాగాలకు భద్రత కల్పించే విధంగా చేయడం అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. ఆనాడు శ్రీకృష్ణ కమిటీ నిర్ణయం మేరకు విజయవాడ గుంటూరు మధ్యలో అరావతి నిర్ణయం చేస్తే ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు రాజధానికి ఇస్తే వారి త్యాగాలను విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన వ్యక్తి జగన్‌ అన్నారు. రైతులు, రాష్ట్ర ప్రజల త్యాగాలు తుంగలో తొక్కారన్నారు. మహిళ రైతులు పాదయాత్ర చేస్తే వారిని అడ్డుకున్నారని, రాజధానికి భూములు ఇచ్చి త్యాగాలు చేసిన రైతుల పట్ల సానుభూతి లేకుండా రాస్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌ అన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే అక్కడే రాజధాని అని, విశాఖ రాజధాని అని, మూడు రాజధానులు అంటూ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అదోగతి పాల్జేశారన్నారు. పార్లమెంటులో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు భేషరతుగా మద్దతు తెలియజేశామన్నారు. అయితే ఒకే ఒక్క  వైసీపీ మాత్రం వ్యతిరేకించడం చారిత్మాక తప్పిందం అన్నారు. ఈ విషయంలో జగన్‌ పిచ్చి తుగ్లక్ గా వ్యవహరించారని విమర్శించారు. ఏబీఎన్‌ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను ఖండించారు. హైదరాబాద్ వెళ్లి దాడులు చేస్తున్నారంటే వారి అరాచాలకు పరాకాష్ట అన్నారు. మీడియా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సాక్షి పత్రిక అడ్డగోలుగా రాయొచ్చు మిగిలిన వాళ్లు రాస్తే దాడులు చేస్తారా అని ధ్వజమెత్తారు. మావిగన్‌ అంటూ లేని పోని మాటలు మాట్లాతున్న జగన్‌కు అవే బుల్లెట్లు రాబోయే ఎన్నికల్లో దిగుతాయని మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి మానసిక స్థితి బాగోక మాట్లాడుతున్నారని అన్నారు. మావిగన్‌ అంటూ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. విచక్షణతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ హితవు పలికారు. అనంతరం కేకు కట్‌ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link