స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి..విశ్వనగరంగా అవతరించనున్న అమరావతి: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం చారిత్రాత్మకం..హర్షం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్

ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టం చేసిన కేంద్రం.. ఇది రైతులు, మహిళల సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం:మంత్రి కందుల దుర్గేష్

బిల్లును వ్యతిరేకించి వైసీపీ తన అహంకారాన్ని చాటుకుందని మంత్రి దుర్గేష్ మండిపాటు

లోక్ సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు…సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టి, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందన్న మంత్రి దుర్గేష్

అమరావతి: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, మంత్రి లోకేష్ కు మరియు రాజధాని కోసం ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

చట్టబద్ధతతో ఇక అమరావతి శాశ్వతం:

రాష్ట్రాభివృద్ధిలో రాజధాని పాత్ర కీలకమని భావించి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని ఏకైక రాజధానిగా ఇటీవల ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేశామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. దీనికి చట్టబద్ధత కల్పించేలా విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర గెజిట్ వెలువడనుందని, 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా అమల్లోకి రానుందని ఆయన వివరించారు. ఈ బిల్లుతో అమరావతిని ఇక ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని స్పష్టం చేశారు.

వైసీపీ తీరుపై ఆగ్రహం:

అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్ సభలో వైసీపీ వ్యతిరేకించడంపై మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. “నాడు ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడి రాజధాని భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. అందుకే ప్రజలు వారిని ఛీత్కరించారు” అని విమర్శించారు. నేడు లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని, ఇది సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.

రైతులు, మహిళల త్యాగాలకు దక్కిన గౌరవం:

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, పోరాటం చేసిన మహిళల త్యాగాలకు ఈ ఆమోదం ఊపిరి పోసిందని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దడమే కాకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. రేపు రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశగా శరవేగంగా పనులు చేస్తుందన్నారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదనే ఉద్దేశంతో అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం విజయం సాధించిందన్నారు.

Scroll to Top
Share via
Copy link