అభివృద్ధి పథంలో నిడదవోలు …. సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజల చెంతకే పాలన: మంత్రి కందుల దుర్గేష్

మోర్తలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరింపు..కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

చిన్నారులకు అక్షరాభాస్యం చేయించిన మంత్రి దుర్గేష్..గడిచిన 22 నెలల్లో మోర్త గ్రామంలోనే రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ఉద్ఘాటన.. చారిత్రాత్మక బిల్లుతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని ప్రకటన

రైతన్నకు అండగా ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’.. ఏడాదికి రూ.20,000 ఆర్థిక సాయంతో సాగుకు ఊతం అందిస్తున్నామని స్పష్టం

తల్లికి వందనం ద్వారా విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్న కూటమి సర్కార్.. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని పేర్కొన్నమంత్రి దుర్గేష్

మగ్గానికి ఉచిత విద్యుత్.. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా మరో ముందడుగు వేసిందని వెల్లడి

తనకు పదవి ముఖ్యం కాదు.. ప్రజా సేవకుడిగా ప్రజల మధ్య ఉండటమే ఇష్టమని తెలిపిన మంత్రి దుర్గేష్

నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన.. అందుకు కూటమి నాయకుల సపోర్ట్ మిన్నగా ఉందన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు: ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం పలువురు చిన్నారులకు అక్షరాభాస్యం చేయించారు.

తల్లికి వందనం – అన్నదాత సుఖీభవపై హర్షం:

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో ‘అమ్మఒడి’ పేరుతో కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చి హామీని తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి ఏటా రూ.15,000 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.తల్లికి వందనం కార్యక్రమంపై రాష్ట్రమంతటా హర్షం వ్యక్తం అవుతోందన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.6000, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14000 తో కలిపి రైతులకు ఏటా 3 విడతల్లో రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తూ రైతన్నకు భరోసా ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.12,500, కేంద్ర వాటాగా 6000 ఇస్తామని చెప్పి కేవలం 7,500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. మొత్తంగా కేంద్ర వాటాతో కలిపి రూ.13,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాదు కుల మతాలకతీతంగా అన్ని వర్గాల రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు. కానీ గత ప్రభుత్వం ఆరుగాలం శ్రమించే రైతన్నకు కూడా కులాలను ఆపాదించి దగా చేసిందన్నారు.

మహిళా సాధికారత మరియు సంక్షేమం:

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు మరియు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు తోడుగా వెళ్లే సహాయకులకు సైతం 50 శాతం రాయితీ కల్పిస్తూ మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని పేర్కొన్నారు.

చేనేతలకు ఉచిత విద్యుత్:

ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 పవర్ లూమ్‌లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుందని, దీని కోసం ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమానికి, చేనేత వస్త్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు.

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి:

గడిచిన 22 నెలల్లో మోర్త గ్రామంలోనే రూ.4.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ 1.0 ద్వారా రూ.36 లక్షలతో రహదారి, డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 6 పనులు పూర్తయ్యాయన్నారు. పల్లె పండుగ 2.0 ద్వారా రూ.52 లక్షలతో 5 పనులు ప్రారంభించనున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.233.60 లక్షలతో ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలనే లక్ష్యం దిశగా వెళ్తున్నామన్నారు.గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏషియన్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మాట్లాడి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించారని గుర్తుచేశారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తామన్నారు. గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి పెరవలిలో శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మండల ప్రజా పరిషత్ నిధుల నుండి రూ.5 లక్షలు, పంచాయతీ నిధుల నుండి రూ.5 లక్షలు వెచ్చించామన్నారు. ఉండ్రాజవరం మండలంలో 12 గోకులం షెడ్లకు రూ.23.20 లక్షలు మంజూరు చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆర్ అండ్ బీ మంత్రితో చర్చించి కానూరు నుండి ఉండ్రాజవరం రోడ్డులో భాగంగా మోర్తలో రూ.60 లక్షలు సీసీ రోడ్లకు మంజూరు చేయించామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచి అందిస్తున్నామన్న మంత్రి దుర్గేష్ కేవలం మోర్త గ్రామంలోనే రూ.42.48 లక్షల విలువైన 977 పెన్షన్లు అందించామన్నారు. కొత్తగా స్పౌజ్ పెన్షన్లను కూడా అందించామని తెలిపారు. త్వరలోనే అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు అందిస్తామని భరోసానిచ్చారు.

సర్వతోముఖంగా నిడదవోలు అభివృద్ధి

నిడదవోలును సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్లు పూర్తిస్థాయిలో బాగు చేస్తామన్నారు. డ్రైన్ల నిర్మాణాలకు, పుంత రోడ్ల అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని ఇప్పటికే వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్నామన్నారు. నిడదవోలు ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, పీహెచ్ సీల ఆధునికీకరణ తదితర కార్యక్రమాలన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో మాట్లాడి నిడదవోలుకు ప్రత్యేకంగా భారీ స్థాయిలో నిధులు రాబట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా వచ్చే శాస్కి నిధులు ప్రతి నియోజకవర్గానికి రూ.6-7 కోట్లు ఇస్తే తాను ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి రూ.28 కోట్లు మంజూరు చేయించానన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో పనులు పట్టాలెక్కుతాయన్నారు. తాను ఎమ్మెల్యే, మంత్రిగా కంటే ప్రజలకు ప్రజాసేవకుడిగా ఉండటానికే ఇష్టపడతానన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రోడ్ల నిర్మాణంలో నిడదవోలు ముందంజలో ఉందన్నారు.

అమరావతి ఏకైక రాజధాని..రాష్ట్రమంటే పట్టని ప్రతిపక్షం:

రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిని ఏకైక రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేశామని, దీనికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని మంత్రి దుర్గేష్ తెలిపారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారని వివరించారు. త్వరలోనే అమరావతి ఏకైక రాజధానిగా గెజిట్ వెలువడనుందని, ఇది ఏపీ ప్రజలందరి విజయమని ఆయన ఉద్ఘాటించారు. రైతులు, మహిళల త్యాగాలకు ఈ తీర్మానం నిదర్శనమన్నారు. అమరావతి తీర్మానానికి వైసీపీ నేతలు మద్దతు తెలపడానికి ముందుకు రావడం లేదని వారికి అమరావతి అంటే ఇష్టం లేనట్లుగా ప్రవరిస్తున్నారన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు వారిని ఛీ కొట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రజానీకం కోరినట్లుగా గెజిట్ లో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

గ్రేట్ విజనరీగా పేరొందిన సీఎం చంద్రబాబునాయుడు, పేదవాడి కంట చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పెట్టుకొని పార్టీని స్థాపించిన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశంలోనే ఉక్కు మనిషిగా పేరొందిన ప్రధాని మోదీల కలయికలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులుపెడుతూ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వారందరి సపోర్ట్, ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యాయని ప్రజల బాగు కోసమే తాను శ్రమిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link