జనసేనాని బాటలో… కూటమి దిశలో… నిడదవోలు సమగ్ర అభివృద్ధే ధ్యేయం: మంత్రి కందుల దుర్గేష్

“కుట్రలు గెలవవు.. అభివృద్ధి ఆగదు అంటూ ఎన్టీవీ కథనాలపై మంత్రి కందుల దుర్గేష్ ధ్వజం”

అభివృద్ధి గణాంకాలతో దుష్ప్రచారానికి చెక్..దుష్ప్రచారాలకు చిరునవ్వుతో సమాధానం

కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఫైర్..అభివృద్ధి ఆగదని, విమర్శలకు తావులేదని ఆగ్రహం

మేము చేసే పనులే మాట్లాడుతాయి… 22 నెలల్లో రూ. 500 కోట్లతో నిడదవోలు అభివృద్ధి చేశామని వెల్లడి

నాడు అరాచకం – నేడు అభివృద్ధి.. మాట ఇస్తే తప్పని నైజం, మడమ తిప్పని సంకల్పం కూటమి ప్రభుత్వానిదన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు గడ్డపై జనసేన జెండా పటిష్టమవుతుందని, నియోజకవర్గ ప్రగతి తమ అజెండా అని తెలిపిన మంత్రి దుర్గేష్…

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, గత 22 నెలల్లో సుమారు రూ. 500 కోట్లతో అపూర్వమైన ప్రగతిని సాధించామని, ఎప్పుడూ మనం చేసే అభివృద్ధినే మాట్లాడాలని, మనం మాట్లాడకూడదని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఎన్టీవీ ఛానల్‌లో ప్రసారమైన కథనాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి దుర్గేష్ చిరునవ్వుతో సమాధానమిస్తూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ కీలకమైన అంశాలను వెల్లడించారు.కుట్రలు గెలవవు.. అభివృద్ధి ఆగదు అంటూ ధ్వజమెత్తారు. కార్యకర్తలను పట్టించుకున్నానా లేదా అన్న విషయం స్వయంగా కార్యకర్తలు, నాయకులనే అడగాలని వాళ్లంతా తన చుట్టే ఉన్నారని చమత్కరించారు. ఇక అభివృద్ధి తాను చేస్తున్న విషయాన్ని సదరు మీడియా సంస్థే ప్రకటించిందన్నారు. ఎన్నికల ముందు నిడదవోలు లో పోటీ చేయాలన్న అధ్యక్షుడి ఆదేశాల మేరకు తాను పోటీ చేశానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిడదవోలులో భారీ మెజార్టీతో తాను గెలిచానని చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు మెండుగా లభించాయని, సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ లో సభ్యుడిగా అవకాశం దక్కడం అదృష్టమన్నారు. అనతి కాలంలోనే నిడదవోలుకు వచ్చి ప్రజల ఆదరాభిమానాలు పొంది భారీ మెజార్టీతో గెలవడం, మంత్రిని అవ్వడం ఇదొక రికార్డు అన్నారు. మంత్రిగా తన బాధ్యతను ఏనాడూ విస్మరించలేదన్నారు.2019-24 కాలంలో ఎలాంటి ఆకృత్యాలు జరిగాయో ప్రజలందరికీ తెలుసునని, నాడు అభివృద్ధి జరగకపోగా కనీసం రహదారులపై తట్టెడు మట్టి వేసిన దాఖలాలు కూడా లేవని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ, ఆర్ అండ్ బీ రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్మిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ఆ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలే చెప్పాలన్నారు.తమ పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించిన మార్గంలోనే జనసైనికుడిగా తాను నడుచుకుంటానన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లోని జనసైనికులు, కూటమి నాయకులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో ప్రత్యేకంగా చర్చించి నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు సాధించామన్నారు. ఇటీవలే రూ.28 కోట్ల కేంద్ర ప్రభుత్వ శాస్కి నిధులు తెచ్చి పనులు చేస్తున్నామన్నారు. అనుక్షణం, ప్రతిక్షణం నిడదవోలు అభివృద్ధికి కంకణబద్దులై ఉన్నానన్నారు.

నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకోవడమే కాకుండా, పట్టణానికి ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’ హోదాను సాధించామని, పట్టణ సుందరీకరణలో భాగంగా 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహించామని చెప్పారు. 60 ఏళ్లుగా చూడని అభివృద్ధిని ప్రస్తుతం చూస్తున్నామని ప్రజలే అంటున్నారని తెలిపారు. తాను పూర్తిగా మనసుపెట్టి పనిచేయడం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇలాంటి కథనాలను పరిగణలోకి తీసుకోనని, పని చేసుకుంటూ ముందుకు వెళ్లడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఇలాంటి కథనాల వల్ల ప్రగతి ఆపాలని అనుకుంటున్న అందరికీ ఒక్కటే మాట అభివృద్ధి ఆగదు కొనసాగిస్తాం అని ఘంటాపథంగా తెలిపారు.

తాను రాష్ట్ర మంత్రితో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల రాష్ట్రమంతటా పర్యటిస్తుంటానని, ప్రత్యేకించి రాజమహేంద్రవరం, కోనసీమ జిల్లాల్లోనూ తాను పార్టీ నేతలతో భేటీ అవుతానని, కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టతిచ్చారు. ఒక ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది నిడదవోలే అని స్పష్టం చేశారు. స్థానికంగా కూటమి, జనసేన బలపడుతుండటం, తాను మంత్రిగా సక్సెస్ కావడం తదితర కారణాల వల్ల కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. “పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ అనుకూల మీడియా, తమ ఉనికి కోల్పోతున్నామని ఇలాంటి కథనాలకు ప్రేరేపిస్తున్న వారి విజ్ఞతకే దీన్ని వదిలేస్తున్నాను. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఎప్పుడూ నా చుట్టూనే ఉంటున్నారు. నా పనితీరుపై స్థానిక జనసైనికులు సంపూర్ణ సంతృప్తితో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తున్నాను.తన కార్యక్రమాల నిర్వహణ, కార్యదక్షణ, కార్యక్షేత్రం నిడదవోలే అని, తన సంపూర్ణ శక్తి, సామర్థ్యాలు నిడదవోలు అభివృద్ధికే కేటాయిస్తానని” స్పష్టం చేశారు.జనసేన సభ్యత్వాల విషయంలో గతంలో కంటే 5వేల సభ్యత్వాలు ఎక్కువే నమోదయ్యాయని, పూర్తిస్థాయిలో స్వచ్ఛందంగా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి 20,000 వేల మంది సభ్యత్వం తీసుకున్నారని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయ్యాక తుది గణాంకాలు వెల్లడిస్తానన్నారు. ఎక్కువగా యువత పార్టీ సభ్యత్వం తీసుకొంటున్నారని తెలిపారు.జనసేన పార్టీ నేతలకు నిడదవోలులో అన్ని రకాల పదవులు కేటాయించామన్నారు. దేవస్థాన కమిటీలు, నీటి సంఘాల కమిటీలు, సొసైటీలు, ఏఎంసీల పదవుల్లో పలువురికి ప్రాధాన్యత కల్పించామని వివరించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో జనసేన క్రమంగా బలపడుతోందని ధీమా వ్యక్తం చేశారు.నిడదవోలు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ప్రజా సేవకుడినే అన్నారు. అరకొర జ్ఞానంతో, పాత్రికేయ విలువలకు స్వస్తి పలికి ఈ తరహా దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. “అరకొర జ్ఞానంతో చేసే విమర్శలు అభివృద్ధిని ఆపలేవు. నిడదవోలును ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా సంకల్పం” అని మంత్రి కందుల దుర్గేష్ ఘంటాపథంగా చెప్పారు.

Scroll to Top
Share via
Copy link