పేదవాడి సొంతింటి కలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో వేడుకగా గృహ ప్రవేశాలు

పందలపర్రులో లబ్ధిదారులకు ఇళ్లు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్

గత ప్రభుత్వం విస్మరించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని వెల్లడి

నిడదవోలు: పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు రూరల్ మండలం పందలపర్రు గ్రామంలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) – మన ఇల్లు మన గౌరవం’ పథకం కింద నిర్మించిన గృహాల గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. వేదమంత్రాల సాక్షిగా లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించగా, ఆకుల వెంకటలక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంత్రి దుర్గేష్ స్వయంగా ఇంటి తాళాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ .. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3426 ఇళ్లు పూర్తి కాగా, నిడదవోలు నియోజకవర్గంలో 122 ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 691 ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ప్రస్తుతం మరో 113 ఇళ్లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఒక కిచెన్, హాల్, బెడ్ రూమ్ సౌకర్యవంతంగా నిర్మించినట్లు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల ప్రాథమిక సాయంతో పాటు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అదనపు తోడ్పాటును అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల ప్రాథమిక సాయంతో పాటు.. బీసీలకు అదనంగా రూ.50,000, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అదనంగా రూ.75,000 సాయం అందిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వం నీళ్లు, కరెంటు, రోడ్ల వంటి కనీస వసతులను విస్మరించగా, తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించి గృహ ప్రవేశాలకు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. పందలపర్రు లే అవుట్‌లో 67 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 52 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పూర్తి చేసిందని ఆయన వివరించారు.

టిడ్కో ఇళ్లపై ప్రత్యేక కార్యాచరణ:

గత ప్రభుత్వం 2019-24 మధ్య కాలంలో టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్, రోడ్లను విస్మరించడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని, ఇటీవల మున్సిపల్ మంత్రి నారాయణ గారితో కలిసి నిడదవోలులో టిడ్కో ఇళ్లను పరిశీలించామని తెలిపారు. త్వరలోనే ప్రత్యేక కార్యాచరణతో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. చాలా వరకు ఇళ్లను 2014-19 కాలంలోనే పూర్తి చేశామని కానీ లబ్ధిదారులకు అందించే నాటికి ప్రభుత్వాలు మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని అని వివరించారు.

అభివృద్ధి పనులు – నిధులు:

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూ.28 కోట్ల శాస్కి నిధులు మంజూరు చేయించామన్నారు.‘పల్లె పండుగ’ 1 మరియు 2 ద్వారా గ్రామీణ రహదారులు, డ్రైన్లు నిర్మించామన్నారు. అదే విధంగా డ్రైన్లు, పుంత రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాలు, రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. పుష్కరాల నాటికి నియోజకవర్గంలో ఆలయాల పునరుద్ధరణ చేస్తామన్నారు.జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించడమే లక్ష్యమని, అమరజీవి జలధార పథకం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల దాహార్తిని తీరుస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. గతేడాది పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు.

సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్:మంత్రి కందుల దుర్గేష్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామని తద్వారా ప్రజలకు మేలు జరుగుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, తోడుగా వచ్చే సహాయకులకు 50% రాయితీ కల్పించడం ప్రభుత్వ మానవీయతకు నిదర్శనమన్నారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో భాగంగా 2047 నాటికి ఏపీ ప్రభుత్వం నెంబర్ 1 స్టేట్ గా ఉండాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం నరేంద్ర మోదీ లు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తాను మంత్రిని అయ్యానని, నేడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కలిగిన అవకాశం ప్రజలు కల్పించిందని గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link