కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి స్వర్ణయుగం: మంత్రి కందుల దుర్గేష్

నడిపల్లికోట పాఠశాల అభివృద్ధికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 24 లక్షలతో మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన

21 నెలల్లో రూ. 3.25 కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ

ప్రభుత్వ బడులే మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని వెల్లడి

విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం పెరవలి మండలం నడిపల్లికోట గ్రామంలోని నెం:2 పాఠశాలలో సమగ్ర శిక్ష నిధులు రూ. 23.95 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. పిల్లలు చదువుకునే పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, అదనపు గదులు నిర్మించడం ద్వారా సౌకర్యాలు పెంచి, తద్వారా అడ్మిషన్లను పెంచవచ్చని ప్రభుత్వం భావించి ఈ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ‘అమ్మఒడి’ పేరుతో మోసం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో బ్యాగులు, పుస్తకాలు, షూస్, యూనిఫాం అందిస్తున్నామని, ఇంటర్ విద్యార్థులకు కూడా కిట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.విద్యార్థుల ఆరోగ్యమే పరమావధిగా ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా నాణ్యమైన సన్నబియ్యం, కోడిగుడ్డు, చిక్కీలతో కూడిన మెనూను అందిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రత్యేక సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయడంతో పాటు, ‘బాలికా రక్ష’ పథకం కింద శానిటరీ ప్యాడ్స్ అందిస్తూ వారికి పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, చదువుతో పాటు వృత్తి శిక్షణా నైపుణ్యాలు కల్పించి భవిష్యత్తులో వారికి ఉద్యోగ భద్రత కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.గత 21 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయులు ఆలోచించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

నడిపల్లికోట గ్రామ సమగ్ర అభివృద్ధి – నిధుల వివరాలు:

గత 21 నెలల కాలంలో నడిపల్లికోట గ్రామానికి మొత్తం రూ. 3.25 కోట్లు కేటాయించామని మంత్రి దుర్గేష్ వివరించారు. పల్లెపండుగ-1 ద్వారా బీసీ కాలనీ, హరిజన వాడల్లో రూ. 49 లక్షలతో సీసీ రోడ్లు, పల్లెపండుగ-2 ద్వారా రూ. 49.20 లక్షలతో గ్రామీణ రహదారులు నిర్మించామన్నారు. పంచాయతీ నిధులతో మరో రూ. 11 లక్షల పనులు చేపట్టామని తెలిపారు. ఏషియన్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 25 లక్షల నిధులతో పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన గోదావరి నీటిని అందిస్తామన్నారు. నాబార్డు ద్వారా రూ. 1.50 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా రూ. 25 లక్షలు, పశు సంరక్షణ కోసం రూ. 4 లక్షలతో 2 గోకులం షెడ్లు మంజూరు చేశామన్నారు. సీఎం సహాయనిధి క్రింద గ్రామంలోని బాధితులకు రూ. 4.17 లక్షల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు.

ప్రజాసేవకుడిగా అభివృద్ధి బాట:

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. తాము అధికారం లోకి వచ్చాక రూ. 30 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మిస్తున్నామని, నిడదవోలు నియోజకవర్గాన్ని విద్యా, రహదారులు, మహిళా పురోగతిలో నంబర్ 1గా నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. “నేను ఎమ్మెల్యే కంటే ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందడానికే ఇష్టపడతాను” అని మంత్రి దుర్గేష్ గారు భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link