రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయింపు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రూ. కోటి వ్యయంతో అర్బ న్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి ప్రత్యేకనిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం తణుకు కొమ్మాయి చెరువు గట్టు సమీపంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. సుమారు రూ. కోటి వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకులో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి వీటిలో ఒకటి 14వ వార్డులో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతి 30 వేలు జనాభాకు ఒక అర్బన్ సెంటర్ నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ సాధ్యంలో రాష్ట్రంలో ప్రజావైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం సైతం పట్టణ ప్రాంతాల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. రాబోయేరోజుల్లో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు విలువచేసే బీమా సదుపాయం కల్పించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని తద్వారా ఆర్థిక ఇబ్బందులకులోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


