వేల్పూరు గ్రామంలో శ్రీరాముని మహిమను ప్రతిబింబిస్తూ ఘనంగా నిర్వహించిన శ్రీ రామ శోభాయాత్ర భక్తి, ఐక్యత వాతావరణంలో విజయవంతంగా సాగింది. మెరక వీధి రామాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా విస్తరించి, పెద్ద సంఖ్యలో భక్తులను ఆకట్టుకుంది.
“ఐక్య హిందూ సమాజం” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కులమత భేదాలకు అతీతంగా భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
కమిటీ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక, డా. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ (హరిబాబు)తో కలిసి శోభాయాత్రలో పాల్గొని, భక్తులతో కలిసి రామనామ స్మరణలో భాగస్వామ్యులయ్యారు.
ఈ సందర్భంగా డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ, ఈ శోభాయాత్ర కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాకుండా, మన ధర్మానికి ప్రతీకగా, ఐక్యతకు నిదర్శనంగా, గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు చూపిన సత్యం, ధర్మం, నిబద్ధతలను ప్రతి ఒక్కరూ జీవితాల్లో ఆచరించాలనే సంకల్పానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణనిస్తాయని అన్నారు.
ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి, ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్థానిక హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను ఆమె అభినందించారు.


