నిడదవోలు సమగ్రాభివృద్ధే లక్ష్యం:మంత్రి కందుల దుర్గేష్

ఉండ్రాజవరం మండలం కాల్దరిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

రూ.2.18 కోట్లతో కాల్దరి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని వెల్లడి

అమరావతే ఏకైక రాజధానిగా అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం చేశామని ప్రకటన..”పరిపాలన వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం” అని పేర్కొన్న మంత్రి దుర్గేష్

ఎర్రకాలువ ముంపు సమస్యకు రూ.400 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్న మంత్రి దుర్గేష్

నిడదవోలు అభివృద్ధికి పక్కా ప్రణాళిక.. ప్రజా సేవకుడిగా నిడదవోలు ప్రగతికి అంకితమవుతానని తెలిపిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: నిడదవోలు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.శనివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దరిలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్దరిలో స్వర్ణ గ్రామ సచివాలయ భవనాన్ని, చిల్ట్రన్స్ పార్క్ ను, అంతర్గత సీసీ రోడ్లను, డ్రైన్లను, మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. గ్రామంలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అచ్చిపాలెం గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్థులను మంత్రి దుర్గేష్ ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా కాల్దరిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్థానిక
ఇందిరమ్మ కాలనీలో రూ.13 లక్షలతో డ్రైన్లు, రూ.29.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు.రూ.53.70 లక్షలతో స్వర్ణ గ్రామ సచివాలయ భవనం, జీపీ గ్రాంట్ల ద్వారా అసంపూర్ణంగా ఉన్న అదనపు పనులు, మరుగుదొడ్డిని పూర్తి చేసి ప్రారంభించామని వెల్లడించారు. జీపీ గ్రాంట్ ద్వారా రూ.4 లక్షల నిధులతో గ్రామంలో వినియోగంలో ఉన్న 90 వేల మరియు లక్షా 50 వేల సామర్థ్యం కలిగిన మంచి నీటి ట్యాంక్ లను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. జేజేఎం గ్రాంట్ ద్వారా రూ.90 లక్షల నిధులతో 40 వేల లీటర్ల సామర్థ్యంతో కూడిన ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేశామని, త్వరలోనే ఇంటిం టికి కుళాయిలు వేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. రూ.5 లక్షల ఎంపీల్యాడ్స్ నిధులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్నామన్నారు. పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. 6 మినీ గోకులం షెడ్డుల నిర్మాణానికి రూ.12.90 లక్షలు ఖర్చు చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో పల్లె పండుగ 1.0, 2.0 ల క్రింద దాదాపుగా రూ.2.18 కోట్లతో కాల్దారి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

రైతన్నకు ముంపు కష్టాల నుండి విముక్తి.. రూ. 400 కోట్లతో ఎర్రకాలువ ఆధునీకరణకు సీఎం సానుకూలత అని మంత్రి దుర్గేష్ వెల్లడి

ఈ సందర్భంగా స్థానిక గ్రామస్థులు, నాయకులు కోరినట్లుగా రైతు సేవా కేంద్రానికి అవసరమైన నిధులను సమీకరిస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా ఎర్రకాలువ ముంపుకు గురవుతుందని ఈ క్రమంలో ఎంపీ పురందేశ్వరీ, తాను, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు కలిసి సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరామన్నారు. అందుకు రూ.300-రూ.400 కోట్లు ఖర్చువుతుందని చెప్పగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. త్వరలోనే ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న రెండు గేట్ల మరమ్మతులకు జలవనరుల శాఖ ద్వారా నిధులు మంజూరై పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.అదే విధంగా తాను, స్థానిక టీడీపీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు కలిసి రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు కృషి చేశామన్నారు. ఈ అంశాన్ని తాను ప్రతి కేబినెట్ సమావేశంలో గుర్తుచేసినట్లు మంత్రి వివరించారు.

గ్రామ సమస్యలకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ

నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. కాల్దరి గ్రామంలో రెవెన్యూ, దివ్యాంగులు, రోడ్లు తదితర సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన వాహనాలను అడిగారని అందుకు చర్యలు తీసుకుంటానన్నారు. స్థానిక కళ్యాణ మండపానికి సుప్రసిద్ధ దర్శకులు రాజమౌళి తండ్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మండపానికి వెళ్లేందుకు అప్రోచ్ సీసీ రోడ్లు కావాలన్న ప్రజానీకం కోరికను దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ ద్వారా నెరవేరుస్తానని తెలిపారు. అత్తిలి కాలువకు రెండు రేవులు కావాలని కోరారని, పుష్కరాల నాటికి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. స్థానిక శివాలయం జీర్ణోద్ధరణలో ఉందని, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానన్నారు.

తాను ఎమ్మెల్యే అయిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లగా రూ.11 కోట్లు మంజూరుచేశారని, ఆ నిధులతో అనేక సమస్యలు పరిష్కరించానన్నారు. పల్లె పండుగ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి రూ.7-8 కోట్లు మాత్రమే వస్తే తాను నిడదవోలు నియోజకవర్గానికి రూ.28 కోట్లు మంజూరు చేయించి తీసుకువచ్చానన్నారు. ఇప్పటికే దాదాపు రూ.12 కోట్ల నిధులు కేవలం ఉండ్రాజవరం మండలానికే కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం పనులు టెండర్ దశలో ఉన్నాయని, పనులు పూర్తయిన వెంటనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. నిడదవోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో..ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం:మంత్రి దుర్గేష్

ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉండేదని మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నానని, తనకు కేటాయించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో పురోగతికి పాటుపడుతున్నానన్నారు. ప్రత్యేకించి మంత్రిగా లభించిన అవకాశంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో నిడదవోలును అంతర్భాగం చేశానని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. మంత్రి గా ఉంటూనే అన్ని సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నిడదవోలు కార్యాలయంలో అందించాలని, తానే స్వయంగా మండల కేంద్రాలకు వచ్చి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు.

అధికారులకు మంత్రి దుర్గేష్ వార్నింగ్..ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేయాలని ఆదేశం

సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా ఇది ప్రజల ప్రభుత్వమని, అధికారులందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే బదిలీలు తప్పవని హెచ్చరించారు. పనిచేసే అధికారులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలే దేవుళ్లని అన్నారు. వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని ఆదేశించారు. అధికారులు బాగా పనిచేస్తే భుజం తట్టి ప్రోత్సాహిస్తామని, పొగరుగా ఉంటే సరైన దారిలో పెడతామన్నారు. కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ గా పరుగెడుతూ ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని,కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రజలకు తామెప్పుడూ సేవకులుగా ఉంటామన్నారు. పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

మూడు ముక్కలాటలకు స్వస్తి.. 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అమరావతిపై చారిత్రాత్మక తీర్మానం చేశామని వెల్లడి.. పరిపాలన వికేంద్రీకరణ వద్దు.. అభివృద్ధి వికేంద్రీకరణే ముద్దు అని స్పష్టం

రాష్ట్రం మొత్తానికి అమరావతి మధ్యలో ఉండటం వల్ల, దానిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అసెంబ్లీ వేదికగా దీనిపై కీలక తీర్మానం చేశామని వెల్లడించారు. మూడు రాజధానుల వంటి అనవసర గందరగోళాలకు ఇక తావు లేదని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. అమరావతి అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బీజేపీ నేతలు అసెంబ్లీ వేదికగా చెప్పారని మంత్రి దుర్గేష్ వివరించారు. కార్యాలయాన్ని ఒకే చోట ఉండాలని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విశాఖ, తిరుపతి, గోదావరి ప్రాంతాలు, అమరావతి ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన వికేంద్రీకరణ అవసరం లేదన్నారు. ఇవాళ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో తప్పనిసరిగా అమరావతినే ఏకైక రాజధానిగా గుర్తించాలని తీర్మానం చేశామని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించి 164 మంది శాసనసభ్యులు సంతకాలు చేసి కేంద్రానికి పంపుతున్నామని, గెజిట్ లో అమరావతి రాజధానిగా పొందుపరచాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపించామన్నారు. 1600 రోజుల పాటు రైతులు, మహిళలు చేసిన త్యాగాలకు ఈ తీర్మానం నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ప్రజా రాజధాని అమరావతిపై కీలక తీర్మానం జరుగుతున్న సమయంలో పాల్గొని అనుమతి మేరకు కాల్దరికి విచ్చేసానని తెలిపారు. ఎమ్మెల్యేగా కన్నా తాను సేవకుడిగా ఉండటానికే ఇష్టపడతానన్నారు. 22 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 20219-24 మధ్య కాలంలో గత ప్రభుత్వం కనీస అభివృద్ధి చేయలేదని కూటమి ప్రభుత్వం వచ్చాకే నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. తాను ప్రత్యక్షంగా దళిత వాడల్లో నివసిస్తున్న ప్రజానీకంతో మాట్లాడితే వారు జరుగుతున్న అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. పది కాలాల పాటు నిలిచిపోయే కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు సంతృప్తి కలిగించే విధంగా పనిచేస్తేనే తాము ప్రజాసేవకులం అవుతామన్నారు. ఆ విషయంలో తాను సంతోషంగా ఉన్నానన్నారు. తనను మంచి మెజార్టీతో శాసనసభ్యుడిగానే కాదు మంత్రిగా చేసిన నియోజకవర్గం నిడదవోలు అన్నారు. గొప్ప పరిపాలన దక్షుడిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు టీమ్ లో సభ్యుడిని కావడం తనకు దక్కిన అదృష్టమన్నారు. నిడదవోలులో నెగ్గితే మంత్రిని చేసే బాధ్యత తనదని ఇచ్చిన మాట ప్రకారం అవకాశం కల్పించిన నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని, ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.

గత ప్రభుత్వంపై విమర్శలు…కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పట్టం కట్టామని వెల్లడి

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ తదితర సూపర్ సిక్స్ హామీలను వివరిస్తూ తద్వారా కలిగిన లబ్ధిని మంత్రి దుర్గేష్ ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం ఏనాడూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు భరోసా కల్పించలేదని విమర్శించారు. నాడు పండించిన ధాన్యానికి కనీసం రైతులకు సకాలంలో డబ్బులు జమ చేయలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నామని, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీపుళ్ల కుమారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, కాల్దరి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link