నియోజకవర్గంలో అన్ని రోడ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు
రోడ్లు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రూ. 2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజవర్గంలో దశలవారీగా రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరితగతన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. శనివారం తణుకు పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్ నుంచి వీకే కన్వెన్షన్ హాల్ వరకు సుమారు 500 మీటర్లు మేర రూ. 2 కోట్లు వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రోడ్లు నిర్మాణంపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం త్వరితన పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు చెప్పారు. ముఖ్యంగా తణుకు మున్సిపల్ కార్యాలయం నుంచి ఇరగవరం రోడ్డు కాలనీ కొండాలమ్మ గుడి వరకు రూ. 3 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణంతో పాటు తేతలి వై జంక్షన్ నుంచి మహిళా కాలేజీ వరకు సుమారు మూడు కిలోమీటర్లు మేర రాష్ట్రపతి రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారని త్వరలోనే వీటి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణం పూర్తిచేయగా తిరిగి మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు. తణుకు పట్టణంలోని ప్రధానమైన రోడ్లు సిమెంట్ రోడ్లుగా నిర్మాణం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తణుకులో నూతనంగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రోడ్లు నిర్మాణంతోపాటు అభివృద్ధి, సంక్షేమాన్ని అన్ని విధాలుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో గుంతల రోడ్లతో ఎన్నో ఇబ్బందులు అవస్థలు పడ్డామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రోడ్లు అభివృద్ధికి చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు రూ. 4 వేల కోట్లు వ్యయంతో రోడ్లు నిర్మాణంతోపాటు మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


