ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న డి.వి.వి.ఎస్ శర్మ (50) అకస్మిక మరణం అత్యంత విషాదకరమని ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు ఆవేదన వెలిబుచ్చారు. కార్యాలయం నుండి మధ్యాహ్నం భోజనానికి బయలుదేరిన శర్మ కు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవగా స్థానికులు, తోటి ఉద్యోగులు అత్యవసర వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెంటపాడు మండలం నుండి బదిలీపై వచ్చిన, కొద్దికాలంలోనే మంచి వ్యక్తిగా పేరుపొందిన శర్మ అకాలమరణం తమనెంతో బాధించిందని ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఉండ్రాజవరం టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, మానవత ఉండ్రాజవరం మండల అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు, కె.సావరం సర్పంచ్ నార్ని రామకృష్ణ, పాలంగి పిఎసిఎస్ అధ్యక్షులు కాకర్ల నాని, ఆయనను కడసారి చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, పలు పంచాయతీల కార్యదర్శులు, పలువురు ఉద్యోగులు రొదిస్తున్న భార్యబిడ్డలను చూసి తీవ్రఆవేదన వెలిబుచ్చారు.


