వ్యవసాయంలో పంచ సూత్రాలు ప్రవేశపెట్టిన కూటమి
ఇరగవరం మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం
రైతులతో భేటీ అయిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లాభసాటి వ్యవసాయం కల్పించాలనే ఉద్దేశంతో పంచ సూత్రాలు ప్రవేశపెట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. మంగళవారం ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత పట్ల రైతులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కావలిపురం గ్రామంలో దాదాపు 300 మంది రైతులకు రూ. 77 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. తణుకు నియోజవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 16500 మంది రైతులకు రూ. 10 కోట్లు వారి ఖాతాలో ఇప్పటికే జమ చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉండేదని ప్రస్తుతం రైతులు తమకు నచ్చిన చోట అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల నుంచి 48 గంటల లోపు సొమ్ములను తమ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించేలా ప్రణాళికలు చేపట్టామని పేర్కొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రోడ్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


