రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదు.. ప్రజల్లో ఉంటేనే మానసిక ప్రశాంతత: మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ

పదవీకాలం ముగిసిన మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు

వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల స్థలాల పట్టాల పంపిణీ

వేసవి దృష్ట్యా ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ప్రారంభం

నిడదవోలు:నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాలులో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంపును మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.

పదవీ విరమణ కాదు.. కేవలం విరామం మాత్రమే:మంత్రి కందుల దుర్గేష్

నేటితో నిడదవోలు మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు ఉండదు. ఇది పదవీ విరమణ కాదు, కేవలం ఒక చిన్న విరామం మాత్రమే” అని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పట్టణాభివృద్ధికి కృషి చేసిన మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణను, వైస్ ఛైర్మన్లను మరియు అన్ని పార్టీల కౌన్సిలర్లను ఆయన అభినందించారు.ప్రజల్లో నిత్యం ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కౌన్సిలర్లు తమ పదవీకాలం ముగిసినా ప్రజల్లోనే ఉండి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో పదవుల్లో ఉండటం, కోల్పోవడం సాధారణ అంశం అన్నారు. భవిష్యత్ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శుభాభినందనలు తెలిపారు.

అభివృద్ధికి చిరునామాగా నిడదవోలు:మంత్రి కందుల దుర్గేష్

గడిచిన 20 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వ సహకారంతో సుమారు 140 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలును అభివృద్ధి పథంలో నడిపించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో పలువురు అధికార పార్టీలోకి రావడం వల్ల ఈ మున్సిపాలిటీ జనసేన వశం అయిందని, కూటమిలో జనసేన భాగస్వామ్యంకావడం వల్ల తాను మంత్రిగా ఉండటం వల్ల అభివృద్ధి వేగవంతం చేశామన్నారు. మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ టీంను భవిష్యత్ లో ఇలాగే నడిపించాలని సూచించారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమస్యలేమైనా ఉంటే తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో నిధులు వెల్లువAE తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశానన్నారు.నిడదవోలుకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా సాధించామన్నారు. రాబోయే రోజుల్లో వారి సహకారంతో మరిన్ని నిధులు రాబట్టి, పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పట్టాల పంపిణీ:

అనంతరం పురపాలక కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. నాయి బ్రాహ్మణ సంఘం, పండ్లు మరియు పూల వర్తకుల సంఘం, పట్టణ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘాల వారికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల పట్టాలను మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిడదవోలు పట్టణం 10వ వార్డులో రజకుల కమ్యూనిటీ హాల్ మరమ్మతుల నిమిత్తం రూ.10 లక్షల నిధులు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజాసేవలో చలివేంద్రం ప్రారంభం

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్వయంగా ప్రజలకు మజ్జిగ, చల్లని తాగునీరు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link