రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్
బాధితుల భుజం తట్టి, కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ… సంతోషం వ్యక్తం చేసిన బాధితులు
నిందితులపై కఠిన చర్యలు తప్పవు – బాధితులకు రూ. 10 లక్షల పరిహారం
మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో చికిత్స
రాజమహేంద్రవరంలోనే అధునాతన టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడి
రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన (అనూరియా) బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్.. వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి, బాధితుల భుజం తట్టి, కరచాలనం చేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు.
బాధితులకు భరోసా – మెరుగైన వైద్యం:
ఈ ఘటన అత్యంత హృదయవిదారకం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులతో సహా మొత్తం 15 మంది ఈ ప్రభావానికి లోనయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా బాధితులకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. వైద్యానికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
ప్రత్యేక వైద్య బృందం – ‘ఫోమి ఫీజోల్’ డ్రగ్:
డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో కిమ్స్ ఆస్పత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజా పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నాం. ఇటువంటి సమస్యలకు సమర్థవంతంగా పనిచేసే ‘ఫోమి ఫీజోల్’ అనే డ్రగ్ వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎంతో చొరవ చూపి ఈ మెడిసిన్ అందుబాటులోకి తెప్పించారని మంత్రి దుర్గేష్ కొనియాడారు.
కల్తీ రాయుళ్లకు మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక:
కల్తీకి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికే నమూనాలు సేకరించాం, నివేదికలు రాగానే బాధ్యులపై ఉక్కుపాదం మోపుతాం. వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకూడదు, నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు.
భవిష్యత్ ప్రణాళిక:
విశాఖలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. పరీక్షల నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా, రాజమహేంద్రవరంలోనే అత్యాధునిక టెస్టింగ్ సెంటర్ నెలకొల్పాలన్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా ఆహారం, పాలు, నీరు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు.


