రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
ఈనెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం..క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని శ్రేణులకు వెల్లడి
సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రూ. 5 లక్షల బీమా ధీమా కల్పిస్తున్నామని, పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని వివరించాలని పిలుపు
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయన ఆదివారం రాజమహేంద్రవరం హుకుంపేటలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్తలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను వెల్లడించారు:
పక్కా ప్రణాళిక – భారీ లక్ష్యం:
రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పార్టీ అధిష్టానం నియమించిందని, రాజమండ్రి సమన్వయకర్తగా సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయి నుంచి విజయవంతం చేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి జనసైనికుడు, వీరమహిళ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ స్థాయిలో సభ్యత్వాలు చేయించాలని సూచించారు.
కార్యకర్తలకు భరోసా – రూ. 5 లక్షల పరిహారం:
జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏ కార్యకర్త అయినా ప్రమాదవశాత్తు మరణిస్తే, వారి కుటుంబానికి పార్టీ తరపున తక్షణమే రూ. 5 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందనే విషయాన్ని ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని కోరారు.
‘సాధక్’ల నియామకం – ఇంటింటికీ ప్రచారం:
పార్టీ భావజాలాన్ని యువతలోకి తీసుకెళ్లి, సభ్యత్వ నమోదు చేసే వారిని ‘సాధక్’లుగా గుర్తిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సాధక్ లు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై పార్టీ ఆశయాలను వివరించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ లింక్ లు, లాగిన్ వివరాలను త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు.
గడువులోగా కసరత్తు పూర్తి:
ఈనెల 24వ తేదీలోపు గతంలో సభ్యత్వాలు చేసిన క్రియాశీల నాయకులు, ముఖ్య నేతలతో సమావేశాలు ముగించి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. త్వరితగతిన జాబితాలను సిద్ధం చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.
సమావేశంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలని కోరిన మంత్రి దుర్గేష్, జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


