గ్రూప్ 1 విజేత సాయి మణికంఠకు ఎమ్మెల్యే అభినందనలు

రేలంగి గ్రామానికి చెందిన యువకుడికి గ్రూప్ 1 ఉద్యోగం

ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన టిఫిన్ సెంటర్ యజమాని గాది పల్లయ్య, గంగాభవాని దంపతుల కుమారుడు సాయి మణికంఠ గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగం సంపాదించినందుకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సాయి మణికంఠను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలను ప్రయోజకులు చేసేందుకు పల్లయ్య, గంగాభవాని దంపతులు ఎంతో కష్టపడిన తీరును ఆయన అభినందించారు. ఓసి కేటగిరీలో ఉన్న ఒకే ఒక పోస్టును ఆయన సాధించడం అభినందనీయమని అన్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి స్వయంకృషి, స్వశక్తితో ఉన్నత చదువు చదివి గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం సాధించి రేలంగి గ్రామానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. గ్రామంలో పల్లయ్య సైతం చిన్నపాటి టిఫిన్ సెంటర్ నడపుకుంటూ ఎంతో కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link