జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి

తణుకులో ఎంఎస్ఎంఈ ప్రవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధి అవగాహన సమావేశం

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పరిశ్రమల స్థాపనకు 45 శాతం సబ్సిడీ

తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి కలెక్టర్ సమావేశం

పారిశ్రామికవేత్తలు పరిశ్రమ స్థాపన వరకు అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలని ఆమె సూచించారు. తణుకు మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ అమల్లో భాగంగా “ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్” సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు, రియల్ ఎస్టేట్ యజమానులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేట్ పారిశ్రామిక వాడల అభివృద్ధిపై అవగాహన పొంది, పలు ప్రశ్నలకు సమాధానాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, వ్యవసాయం, ఆక్వా రంగంలో ఉన్న అభివృద్ధి పారిశ్రామికంగా లేదన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూములు కొరత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు ఇండస్ట్రీస్ పార్క్స్ పాలసీని అనుసరించి నేడు మీ అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువతకు పరిశ్రమ స్థాపన ఆలోచన ఉన్న ప్రోత్సాహం అవసరం అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రైవేటు భూములు కలిగిన యాజమాన్యాలు ముందుకు వస్తే ప్రైవేటు పారిశ్రామిక వాడల అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. తద్వారా యువత ఆలోచనలతో పరిశ్రమలను స్థాపించి జిల్లాను పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడిపించవచ్చని తెలిపారు. మన జిల్లాలో ఆక్వా 1.33 లక్షల ఎకరాలు, వ్యవసాయం 2.25 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. అన్ని విధాల ఆర్థికంగా బలంగా ఉన్న మన జిల్లా ఏజెన్సీ జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లాతో పోలిస్తే ప్రగతి రేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉండటమే అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, వేలకోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ఒప్పందాలను కూడా చేసుకోవడం జరిగిందన్నారు. మన జిల్లాలో యువతకు పరిశ్రమలను స్థాపించే సత్తా ఉందని, పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించాలన్నారు. మన రాష్ట్రంలో శ్రీ సిటీ పేరిట 8 వేల ఎకరాలలో 250 పరిశ్రమలతో ప్రైవేటు పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ పరిశ్రమలలో తిరుపతి, నెల్లూరు, తమిళనాడుకు చెందిన వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. మన జిల్లాలో కూడా 1947 ప్రాంతంలోనే ఆంధ్ర షుగర్స్ ను స్థాపించి పారిశ్రామికంగా ప్రోత్సహించడం మీ అందరికీ తెలిసిందే అన్నారు. ప్రైవేటు భూములతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 45 శాతం సబ్సిడీని అందించడం జరుగుతుందన్నారు. అలాగే ల్యాండ్ కన్వర్షన్ చార్జెస్, లేఅవుట్ అప్రూవల్, స్టాంపు డ్యూటీ నూరు శాతం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తున్నదని, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని, ఇకముందు కూడా ఇదే వరవడి కొనసాగుతుందన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందు ఉంచేందుకు జిల్లా కలెక్టర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వారి సహకారంతో తణుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరి సహకారంతో జిల్లాలోనే మొట్టమొదటి ప్రైవేటు పారిశ్రామిక వాడను మన నియోజకవర్గంలో స్థాపిస్తానని మీ అందరి తరపున మాటిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు సెక్టార్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల పెట్టుబడితో 16 లక్షల ఉద్యోగాలు కల్పనకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పారిశ్రామిక ప్రగతితో యువతకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ప్రైవేటు పారిశ్రామిక వాడ స్థాపనతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో కొంతమంది ప్రైవేటు భూమి యజమానులు మాట్లాడుతూ చదువుకున్న వారికే సబ్సిడీ ఉంటుందా, రోడ్లు వెడల్పు ఎంత ఉండాలి, మొత్తం భూముల్లో ఎంత భూమి రోడ్లు, గ్రీనరీ, పార్కింగ్కు కు వదలాలి, సబ్సిడీ ఎంత ఇస్తారు, పరిశ్రమల స్థాపనకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు, తదితర ప్రశ్నలను అడిగి సమాధానాలను తెలుసుకున్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదగా చీరలు, దుప్పట్లు, ఫ్యాంటు, షర్ట్లు బిట్స్, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఖతీబ్ కౌసల్ భానో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, తహసిల్దార్ అశోక్ వర్మ, ప్రైవేటు భూముల యజమానులు, ఔత్సాహిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link