కేంద్రంతో చర్చించి ఏలూరుకు సంగీతం నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని హామీ
ఏలూరు: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించి ఏలూరుకు సంగీత నృత్య కళాశాల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రూ. 5.25 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియంలోని డిజిటల్ బుక్ రూమ్ ను, స్కల్ప్చర్ గ్యాలరీని సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన డిజిటల్ బుక్ లో ప్రతి పేజీలోని ఇమేజిని తాకితే ప్రత్యక్ష అనుభూతిని పొందడం ఆశ్చర్యంగా ఉందని ఆసక్తిగా తిలకించారు. అదే విధంగా కాంస్యకళతో రూపొందించిన శ్రీరామ, లక్ష్మీనారాయణ, గరుడ, వైష్ణవ ఋషి, మావటి విగ్రహాలను తిలకించారు. భారతీయ జీవితాన్ని, ఆలోచనలు ప్రతిబింబింప చేసిన హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన బుద్ధుడు, జైన తీర్థంకరులు, విష్ణువు వెంకటేశ్వరుడు, ఆల్వార్లు, శ్రీదేవి, భూదేవి, నటరాజ కాంస్య శిల్పాలను పరిశీలించారు. నాటి కాలానికి సంబంధించిన శిరస్త్రాణం, ఖడ్గములు, డాలు, ఆయుధాలు, కవచాలను చూసారు. తొలి చారిత్రక యుగపు మృణ్మయ పాత్రలు, బృహత్ శిలాయుగం నాటి సమాధులు, జీవన విధానాలను తెలిపే చిత్రాలను, ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాల నాటి పరికరాలను, ఆది మానవుడిని మొదలుకొని నేటి మానవ వికాస దశలను, రుద్రమకోట బృహ శిలాయుగ సమాధులను పరిశీలించారు. అదే విధంగా తూర్పు చాళుక్యులు, తుగ్లక్, విజయనగర వంశం, శాలం కాయనుల, శాతవాహన, సదవంశం, విద్ధంక, కుర రాజవంశ, ఈస్ట్ ఇండియా, పోర్చుగీస్, ట్రావెన్ కోర్ సంస్థానం, బ్రిటిష్ ఇండియా, ఇండో ఫ్రెంచి, సుమత్రా దీవి, హెల్కర్, బహుమనీ, గోల్కొండ సుల్తానులు, మధురై నాయక వంశం, మరాఠా సామ్రాజ్యం, అసబ్ జాహీ కాలం నాటి నాణేలు, పంచలోహ విగ్రహాలు, శిలాజాలు, తాళపత్ర గ్రంధాలు, తామ్ర శాసనాలు, ఖురాన్ చేతి ప్రతి గ్రంధాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హేలాపురిగా కీర్తి పొందిన ఏలూరు చరిత్రను వివరించారు. భావితరాలకు ప్రాచీన సంస్కృతిని తెలిపేది పురావస్తుశాఖ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంకురార్పణ చేసిన మ్యూజియాన్ని నేటి ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి చేయడం ఆనందం గా ఉందన్నారు. ప్రపంచం నలుమూలల రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్పవిషయం అని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల సంవత్సరాలనుండి 1000 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి పరికరాన్ని మ్యూజియంలో భద్రపరిచారన్నారు. పోలవరం సమీపంలోని రుద్రమకోట వద్ద తవ్వకాల్లో లభ్యమైన అరుదైన మట్టి బొమ్మలు, తాబేలు పూసలు ప్రదర్శించడం మరొక ప్రత్యేకత అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చరిత్ర, సాంప్రదాయ సిద్ధమైన కళా, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం కళలను, కళాకారులను పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కవులు, కళలు, కళాకారులను గౌరవించి ఉగాది పురస్కారాలు, నాటక రంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి రంగస్థల, విశిష్ట పురస్కారాలు అందజేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ముందు తరాలకు తెలిసేలా, ప్రజా బహుళ్యం లోకి వెళ్లేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అదేవిధంగా పలు అకాడమీలకు లబ్ద ప్రతిష్టులైన, చైర్మన్ లను, డైరెక్టర్లను నియమించడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విభాగాన్ని కేటాయించాలన్న విజ్ఞప్తికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి దుర్గేష్ అన్నారు. అదే విధంగా పలువురు విజ్ఞప్తి మేరకు ఆర్కియాలజీ మ్యూజియంకు సంపూర్ణ సహకారం అందిస్తామని, 3వ అంతస్తు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
తాను ఇటీవల లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు నేషనల్ థియేటర్ ను సందర్శించానని, నేటికీ అక్కడ మన కళలకు ప్రాధాన్యత ఉందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. అదే విధంగా లండన్ మ్యూజియం విశేషాలు తెలిపారు. నేటి పోటీ ప్రపంచం లో, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన నేపథ్యంలో భావి తరాలకు వారసత్వ సంపదగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవానికి రాబోయే రోజుల్లో సంపూర్ణ సహకరం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాచీన చరిత్రకారులు, ఏలూరు వాసి కావలి బుర్రయ్యను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ మ్యూజియంను సందర్శించి నాటి వైభవాన్ని తెలుసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగర మేయర్ నూర్జహాన్ బేగం, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు, కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి, స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇడా చైర్మన్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రముఖ చరిత్రకారులు అయ్యంగార్, ఆర్కియాలజీ అధికారులు,
కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


