రైతుల గురించి మాట్లాడే అర్హత కారుమూరికి లేదు

తుఫాను సమయంలో రైతులు, బాధితులకు అండగా కూటమి నిలబడింది

ఐదేళ్ల వైసిపి పాలనలో రైతులను అవహేళన చేసింది కారుమూరి

నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 3.45 కోట్లు పరిహారం మంజూరు

మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు లేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. మొంథా తుఫాను సమయంలో హైదరాబాదులో ఉన్న కారుమూరి తుఫాను అంతా చక్కబడిన తర్వాత వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. గత ఐదు ఏళ్ళుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులను అవహేళన చేస్తూ ఏనాడు వారిని పట్టించుకో లేదన్నారు. తుఫాను హెచ్చరికలు ముందు నుంచి అధికారులు, కూటమి నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తణుకు నియోజవర్గంలో పంట నష్టపోయిన రైతులను గుర్తించి పంట నష్టం అంచనాలు చేశామని గుర్తు చేశారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో మొత్తం 3253 ఎకరాలు పంట నష్టపోయినట్లుగా గుర్తించి 3373 మంది రైతులకు రూ. 3.45 కోట్లు మేర పంట నష్టం పరిహారాన్ని అందించేందుకు సిద్ధం చేశామని చెప్పారు. పంట నష్టపోయిన వారిలో వైసీపీ నాయకులు సైతం ఉన్నారని పేర్కొన్నారు.
తణుకు నియోజకవర్గంలో దాదాపు 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. తుఫాను అనంతరం కూడా పునరావాస కేంద్రాలకు రాలేని బాధితులను గుర్తించి 2500 మందికి ప్రభుత్వం నుంచి కిట్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రైతులు తమ గోడు వినిపించేందుకు వచ్చిన వారిని దుర్భాషలాడిన కారుమూరి ఇప్పుడు రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రి పప్ప అంటూ రైతులను ఉద్దేశించిం మాట్లాడింది కారుమూరి కాదా అని ప్రశ్నించారు. తణుకు మండలం దువ్వ జాతీయ రహదారిపై పంట నష్టపోయాం అని చెబుతున్న రైతులను నోర్ముయ్ అంటూ సంభోదించలేదా అని ప్రశ్నించారు. అర్జునుడుపాలెం గ్రామ సభలో సైతం రైతులు తమ గోడ వినిపించేందుకు ముందుకు వస్తే వారిని సైతం నోటికి వచ్చినట్లు కారుమూరి దుర్భాషలాడాలని అన్నారు. ఇలా రైతుల పట్ల తనకున్న హేయభావాన్ని కారుమూరి ప్రదర్శించారని పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సైతం రైతులకు అప్పటి ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రైతులను కారుమూరి అవహేళనగా మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి ఎమ్మెల్యే రాధాకృష్ణ చూపించారు.

Scroll to Top
Share via
Copy link